అసెంబ్లీలో బడ్జెటుపై జరిగిన చర్చలో కేసీఆర్ బడ్జెట్ గురించి కాకుండా తన ఆరోగ్యంపై ఎందుకంత వివరణ ఇచ్చారు? దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎప్పుడో తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన రచ్చను ప్రస్తావించారు. అదెందుకు ఇప్పుడు ప్రస్తావించారనేదే ప్రస్తుతం అందరికీ హాట్ టాపిక్.
హైదరాబాద్: కేటీఆర్‌ను సీఎం చేసే విషయాన్ని కేసీఆర్ సభలో ఎందుకు ప్రస్తావించినట్లు? పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్‌పై ఇచ్చే రిప్లయ్‌లో అవసరమైన ముఖ్యమైన అంశాలన్నీ నర్మగర్భంగా ప్రస్తావించారా.. అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయ్. ఈటల, నాయిని, రసమయి, ఇతరుల వ్యాఖ్యలు. ఓనర్లు కిరాయిదారుల చర్చ, మంత్రిపదవులు దక్కని వారు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని విప్పడం, పార్టీని వీడి వెళ్లేందుకు కొందరు నేతలు సిద్దపడటం, మరోవైపు బీజేపీ తన దూకుడు పెంచడం, కేటీఆర్‌ని సీఎంను చేస్తారంటూ పార్టీలో బయట జరుగుతున్న చర్చ.. అదే సమయంలో హరీష్‌కి ప్రాధాన్యం తగ్గించారన్న అభిప్రాయం బలంగా కార్యకర్తల్లోకి పోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి హరీష్‌ని దూరం పెట్టడం… ఇలా అనేక పరిణామాల నేపథ్యంలో ఇంటా బయటా టీఆర్‌ఎస్ కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. ఈ సందర్భరంలోనే బడ్జెట్ సమావేశాలు రావడం, బడ్జెట్‌పై చర్చ జరగడం, దానికి సీఎం రిప్లయ్ ఇవ్వడం జరిగింది. బడ్జెట్‌పై విపక్షాలు లేవనెత్తిన అంశాలతో పాటు పనిలో పనిగా ఇంటా బయటా పార్టీ గురించి జరుగుతున్న రచ్చకు కూడా సమాధానం ఇవ్వాలని కేసీఆర్ భావించారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లేకుంటే తన ఆరోగ్యం గురించి ఇప్పుడు ఎక్కడా ఎటువంటి ప్రస్తావనా లేదని, లేనిదాని గురించి అసందర్భంగా ప్రస్తావిస్తూనే దానితోపాటు కేటీఆర్‌ను సీఎంని చేసే విషయాన్ని, అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గురించి, వనమా గురించి ప్రస్తావిస్తూ ‘వాళ్ళు చాలా మంచివాళ్ల’ని కితాబు ఇచ్చారు. అలాగే హరీష్‌రావు కాళేశ్వరం గురించి చాలా కష్టపడ్డాడని చెప్పుకోవడం కూడా ఒక వివరణ కోసమే. వచ్చే మరో మూడు టర్ములు కూడా మా ప్రభుత్వమే ఉంటుందని కేసీఆర్ అనడం కూడా పార్టీలో అసంతృప్త గళాల కోసమే. పార్టీని వీడాలని అనుకునే నాయకులను పరోక్షంగా భయపెట్టడం కోసమే కేసీఆర్ ఇవన్నీ మాట్లాడి వుంటారని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని కేసీఆర్ చెప్పకనే చెప్పడం ఆ పార్టీకి ఎంత భయపడుతున్నారో సూచిస్తోందని అంటున్నారు. పార్టీ మారాలనే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని కేసీఆర్ ఈరకంగా సంకేతం కూడా ఇచ్చారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వోవరాల్‌గా సీఎం అసెంబ్లీలో ఇచ్చిన వివరణ రాజకీయ వర్గాలలో.. ముఖ్యంగా గులాబీ శ్రేణులతో ఆసక్తికరమైన చర్చను లేవనెత్తింది.