టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కొత్త పార్టీ పెడితే ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఉదాహరణలతో వివరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని, దానికి ఎంతో శ్రమపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు కేసీఆర్. ఇదివరకు ఎన్ని పార్టీలు వచ్చాయి, పోయాయని.. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా అని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎవరు ఏమయ్యారో తెలియదా అని ప్రశ్నించారు. ఓ ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు.
1985లో టీడీపీ తరపు తాను సిద్దిపేట నుంచి, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచామని.. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటివారితో కలిసి రామచంద్రారెడ్డి కొత్త పార్టీ పెట్టారని.. మళ్లీ కొద్ది రోజులకే కాంగ్రెస్‌లో చేరారన్న కేసీఆర్…ఆ తర్వాత రామచంద్రారెడ్డికి టికెట్ కూడా రాలేదని, అలాగే తెరమరుగు కావాల్సి వచ్చిందని సోదాహరణంగా వివరించారు. చివరికి రామచంద్రారెడ్డికి ఇటీవల సిద్ధిపేటలో తానే ఇంటి స్థలం ఇప్పించి.. నిర్మాణానికి ఆర్థికసాయం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రాంగ్ ట్రాక్‌లో వెళితే ఇలాగే ఉంటుందని.. రామచంద్రారెడ్డి మంచివాడైనా రాజకీయాలు వేరేగా ఉంటాయని చెప్పుకొచ్చారు కేసీఆర్. కానీ ఆయన అలా చెప్పడానికి కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో ఇటీవల ఎవరూ పార్టీ పెడుతున్నట్టు చెప్పలేదు. కనీసం అలాంటి ప్రచారం కూడా జరగలేదు. కానీ కేసీఆర్ ప్రత్యేకంగా కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే కష్టానష్టాల గురించి ప్రత్యేకంగా వివరించడం, పార్టీలోనే ఎవరికో పరోక్షంగా హితబోధచేసినట్టుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.