ఎనిమిదవ నిజాం ముకర్రం ఝా భౌతిక కాయం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆయన పార్థివ దేహాన్ని టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు. శంషాబాద్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు.
చౌమహల్ ప్యాలెస్‌కు వెళ్లి ముకర్రం భౌతిక దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ముకర్రం ఝా కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎంతో పాటు డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్ కూడా నివాళులు అర్పించారు.
ముకర్రం ఝా భౌతిక కాయాన్ని చూసేందుకు నిజాం కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ రోజు అనుమతిస్తున్నారు. ముకర్రం పార్థి వ దేహాన్ని చూసేందుకు నిజాం అభిమానులు, సామాన్య జనానికి రేపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన అంతిమయాత్ర జరుగుతుంది. ఈ యాత్ర చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కామసీదు వరకు కొనసాగుతుంది. తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు.
ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ నిన్న టర్కీలో తుది శ్వాస విడిచారు. ముకర్రమ్‌ఝా మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముకర్రం ఝా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.