తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా మన కలెక్టరేట్లలా లేవని అన్నారు. ఏడేళ్లలో తెలంగాణలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు వివరించారు.
ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు సీఎం. గోదావరి ఉద్ధృతంగా పారే జిల్లాలో నీటి కొరత చూసి ఎంతో బాధపడ్డానని.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకుని జిల్లాకు నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ కొనలేనంత ధాన్యం దిగుబడి వస్తోందని అన్నారు. కరువు జిల్లాగా ఉన్న జనగామ.. బంగారు జిల్లాగా మారాలని తెలిపారు.
వాసాలమర్రిలో ఇప్పుడు ఎకరం కోటి రూపాయలు అయ్యిందన్నారు కేసీఆర్. రీజినల్ రింగ్ రోడ్డుతో రాబోయే రోజుల్లో భూములు బంగారం అవుతాయన్నారు. రూ.2 లక్షలు ఉండే ఎకరం భూమి విలువ ఇప్పుడు రూ.2 కోట్లకు చేరిందని వివరించారు. ఎందరో హైకోర్టు న్యాయమూర్తులు హైదరాబాద్ లోనే స్థిరపడిపోతున్నారని.. నగర పరిసరాల్లో రూ.30 కోట్లు పెట్టి విల్లాలు కొంటున్నారని తెలియజేశారు.
ఉద్యోగుల కృషి వల్లే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు సీఎం. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయని చెప్పారు. ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని.. మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు ఇష్టపడడం లేదన్నారు. కానీ.. అలా వెళ్లే వారికి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారు.
మన ప్రజల తలసరి ఆదాయం త్వరలో రూ.2.70 లక్షలు కానుందన్న సీఎం.. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల చేతికే నిధులు వెళ్తున్నాయని.. ప్రభుత్వ నిర్ణయాలను నిమిషాల్లో అమలు చేయగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారని వివరించారు.