యాదాద్రి ప్రధాన ఆలయంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకున్నారు.
కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ దంపతులు గుట్టపైన ఉన్న శివాలయంలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి, మహా కుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు.
రామలింగేశ్వరుడికి మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరో రోజు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశమందు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక లింగ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట హోమం నిర్వహించారు.
యాదాద్రి ప్రధానాలయ పునఃనిర్మాణ సమయంలోనే శివాలయాన్ని నిర్మించారు. ఆంజనేయస్వామి, నవగ్రహ, మరకత మండపాలు, రామాలయం ఏర్పాటు చేశారు.