– మన అభివృద్ధిలో సగం చేసినా దేశం బాగుపడేది
– రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది
– బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశం బాగుపడదు
– మతపిచ్చి వల్ల ప్రజల్ని విడదీస్తే ఏం లాభం?
– కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి
– మహబూబాబాద్ సభలో కేసీఆర్
మోడీ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. మహబూబాబాద్ లో నూతన కలెక్టరేట్ ను, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు కేసీఆర్. దేశంలో మతపిచ్చి, కులపిచ్చితో ప్రజలను విడదీస్తే మరో ఆఫ్ఘాన్ లా తయారవుతుందన్నారు. కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఉద్యమ సమయంలో మహబూబాబాద్ లో దారుణమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు కేసీఆర్. వాటిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. వర్ధన్నపేట, పాలకుర్తిలో సగం పూర్తైన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నానని తెలిపారు. తమ నేలకు ఎప్పుడొస్తావని గోదారమ్మకు మొక్కుకునేవాడినని చెప్పారు. కురివి వీరభద్రుడికీ మొక్కుకున్నానన్నారు. మానుకోట రాళ్ల బలం, కురివి వీరభద్రుడి దయ అన్నీ కలిసి రాష్ట్రం సాకారమైందని చెప్పారు.
పూర్తిగా గిరిజన ప్రాంతమైన జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రకటించారు. అంతేగాక, జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు అనౌన్స్ చేశారు.
తెలంగాణ ఏర్పడింది కాబట్టే రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్ ప్రాంతం వెనుకబాటుకు గురైందని అన్నారు. మనం చేసుకుంటున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సగం చేసినా దేశం ఇప్పటికే బాగుపడేదని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించకపోగా.. కాలు అడ్డం పెడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశం ఇలాగే ఉంటుందని విమర్శించారు కేసీఆర్.