– టచ్ లోనే మమత, స్టాలిన్
– థర్డ్ ఫ్రంట్ పై కేసీఆర్ హింట్
– మోడీ సర్కార్ ను తరిమేద్దామని పిలుపు
– మత కల్లోలాలు.. ఆకలి రాజ్యం..!
– బీజేపీ వల్ల దేశం సర్వనాశనం..!
– ఎవరూ చూస్తూ కూర్చోరు..!
– రాయగిరి సభలో విరుచుకుపడ్డ కేసీఆర్
ఫ్రంట్ లేదు టెంట్ లేదంటూ ఈమధ్య కామెంట్స్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నేతలు టచ్ లోనే ఉన్నారని హింట్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన రాయగిరిలో టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. బీజేపీ విధానాలతో బాగుపడ్డవారు ఎవరూ లేరని.. మోడీ పాలనలో ఎవరికీ నయా పైసా పని జరగలేదని విమర్శించారు. కేసీఆర్.. నీ సంగతి చూస్తామని బీజేపీ నేతలంటున్నారు.. తాను భయపడితే తెలంగాణ వచ్చేదా? అంటూ మండిపడ్డారు. మతకల్లోలాలు రేగితే పెట్టుబడులు వస్తాయా?.. దేశాన్ని మోడీ నాశనం చేస్తే ఎవరూ చేతులు ముడ్చుకొని కూర్చోరని అన్నారు.
కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా తన దగ్గర ఉందన్నారు కేసీఆర్. రాహుల్ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారని చెప్పారు. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో బీజేపీ బాగోతాలు చెబుతానని.. మమతా బెనర్జీతో శుక్రవారం మాట్లాడినట్లు వివరించారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు టచ్ లో ఉన్నారని.. అసోం సీఎం రాహుల్ గాంధీ పుట్టుక గురించి అసభ్యకరంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. జనగామ ప్రసంగంపై బీజేపీ నేతలు.. నువ్వెంత అని విమర్శిస్తున్నారు.. తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలపై పోరాటం చేయాలన్నారు. తాను చనిపోయినా సరే.. విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బావులకు మీటర్లు పెట్టేదే లేదని స్పష్టం చేశారు. దేశంలో ఆకలి పెరుగుతోందన్న సీఎం.. ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. కర్నాటకలో విద్యార్థులపై రాక్షసుల మాదిరిగా ప్రవర్తించవచ్చా? అని ప్రశ్నించారు కేసీఆర్. మోడీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయిందని.. నిరుద్యోగ శాతం పెరిగిందని.. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయన్న కేసీఆర్.. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మత పిచ్చి అవసరమా? అని అభిప్రాయపడ్డారు. అమెరికా లాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదని.. అందుకే అక్కడ అభివృద్ధి జరిగిందని వివరించారు. రైతులను కేంద్రం తీవ్రంగా అవమానించించదన్న కేసీఆర్.. యూపీలో కేంద్రమంత్రి కుమారుడు రైతులను తొక్కించి చంపాడని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు సాగుతోందని చెప్పారు. తలసరి ఆదాయంలోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామన్నారు. తెలంగాణలో సంపద పెరుగుతోందని.. భూముల విలువలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు.
అవినీతి రహితంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్న సీఎం.. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి దిశగా వెళ్తున్నట్లు చెప్పారు. ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్ తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు. భువనగిరి జిల్లాలో ఉన్న వెనకబాటుతనం క్రమంగా తొలగిపోతోందన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వస్తాయని.. మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు తొలగిపోయాయని చెప్పారు.
జిల్లా పర్యటనలో భాగంగా… భువనగిరిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని.. తర్వాత జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించారు కేసీఆర్. ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదని.. ఎన్టీఆర్ ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా కుదరలేదన్నారు. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమన్న సీఎం.. హైదరాబాద్, వరంగల్ అద్భుతమైన కారిడార్ గా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. భువనగిరిలో ఎకరా దాదాపు రూ.2-3 కోట్ల వరకు ధర పలుకుతోందన్నారు. దళితబంధుపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. ఏ వర్గాన్నీ వదలకుండా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామని వివరించారు కేసీఆర్.