బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జనం భారీగాతరలి రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కి ఫోన్ చేసి మాట్లాడారు. జనం పెద్దఎత్తున రావడం పట్ల మెచ్చుకున్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. శభాష్ అజయ్ అంటూ ప్రశంసించారు.
ఈ సందర్భంగా జాతీయ నేతలు తనతో అన్న మాటల్ని అజయ్ తో పంచుకున్నారు కేసీఆర్. భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి వారంతా ఆశ్చర్య పోయారని చెప్పారు. హెలికాప్టర్ లో వస్తుండగా ఇతర రాష్ట్రాల సీఎంలు సభకు వస్తున్న జనాన్ని చూసి ఇంతమంది జనమా అంటూ షాకయ్యారన్నారు సీఎం.
నిజానికి సభా వేదికపైనే పువ్వాడ అజయ్ ని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. అయితే.. హైదరాబాద్ చేరుకున్నాక మరోసారి స్పెషల్‌గా ఫోన్ చేసి అభినందించారు. ఇక ఖమ్మం సభలో జిల్లాపై వరాల జల్లు కురిపించారు కేసీఆర్. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.30కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి, మధిర, వైరాలను సైతం ఖమ్మం మున్సిపాలిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలోని జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలం కేటాయించాలని మంత్రి హరీష్ రావు, పువ్వాడ అజయ్ కు సూచించారు కేసీఆర్.