– 26న తెలంగాణకు ప్రధాని
– మోడీ టూర్ ను స్కిప్ చేసిన కేసీఆర్!
– 27 వరకు ఇతర రాష్ట్రాల పర్యటనలు
– ఎందుకు ముఖం చాటేస్తున్నారని బీజేపీ ప్రశ్న
– కేటీఆర్ టూరిస్ట్ డైలాగ్ పైనా సెటైర్లు
– కేసీఆర్ వడా పావ్ కోసం వెళ్లారా అంటూ చురకలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాట అదుపులో ఉండాలనే దానికి చక్కటి ఉదాహరణే ఈ టూర్ అని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు పొలిటికల్ టూరిస్టులు అంటూ హడావుడి చేశారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీ నేతలు ఇక్కడికొచ్చి బిర్యానీ తిని వెళ్లిపోతారని టీఆర్ఎస్ నేతలు ఎలా అన్నారో… కేసీఆర్ ఇప్పుడు అక్కడకు వెళ్లి వడా పావ్ తిని రావడం తప్ప ఏం ఉపయోగం ఉండదని సెటైర్లు వేస్తున్నారు. అందుకే మాట జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించాల్సిందేనని పెద్దలు ఊరికే చెప్పారా? అని గుర్తు చేస్తున్నారు.
ఇటు మోడీ తెలంగాణ పర్యటన సమయంలోనే కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లడంపై బీజేపీ నేతలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మోడీకి ముఖం చూపించలేకే కేసీఆర్ తప్పించుకుతిరుగుతున్నారని అంటున్నారు. ఈనెల 26న మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం చెప్పాల్సి ఉంటుంది. కానీ.. 27 వ తేదీ వరకు కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు పెట్టుకున్నారు. అంటే మోడీ టూర్ ను ఆయన స్కిప్ చేసినట్లే. ఇదంతా కేసీఆర్ కావాలనే ప్లాన్ చేశారని అంటున్నారు బీజేపీ నేతలు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలోనూ ఇలాగే ప్రోటోకాల్ పాటించకుండా ఏవేవో కారణాలతో ప్రధానికి స్వాగతం చెప్పలేదని.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా పాగా వేయాలని నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలు కలిశారు. కానీ.. కాంగ్రెస్ లేకుండా కూటమి కష్టమని అందరూ లైట్ తీసుకుంటున్నారు. దీంతో మరో సైడ్ నుంచి నరుక్కురావాలని పీకే ప్లానింగ్ లో చనిపోయిన రైతు, సైనిక కుటుంబాలపై దృష్టి పెట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన రైతులు, బార్డర్ లో మరణించిన సైనికుల ఫ్యామిలీలకు ఆర్థిక సాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విధంగా జాతీయ రాజకీయాల్లో, మీడియాలో హైలెట్ కావొచ్చని పీకే, కేసీఆర్ ప్లాన్ చేశారనే చర్చ జరుగుతోంది.
ఈ పర్యటన నేపథ్యంలో మరో అంశంపైనా జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేంటి?.. దీనిపై రాజకీయ వర్గాల్లో తెగ చర్చించుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను అరిగోస పెట్టారు.. వ్యవసాయాన్ని నాశనం చేసే నిర్ణయాలతో రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అని గప్పాలు కొడుతున్నారు.. అదే నిజమైతే మరి.. 30 లక్షల పంప్ సెట్లు ఎందుకున్నాయి.. ఉచిత కరెంట్ ఎందుకిస్తున్నారు? సరైన వసతులు లేక చాలా స్కూళ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.. ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలను వివరిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 194 జీవో ప్రకారం కేవలం వెయ్యి మందికి మాత్రమే 6 లక్షల సాయం అందిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడి వారిని పట్టించుకోకుండా.. ఇతర రాష్ట్రాల సమస్యలు ఎక్కువయ్యాయా? అని నిలదీస్తున్నారు.
తాజా ఢిల్లీ పర్యటనలో కేసీఆర్.. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతోనూ భేటీ కానున్నారు. దీన్నిబట్టి.. కేవలం రాజకీయాల కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని.. నిజంగా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని అంటున్నారు విశ్లేషకులు.