– పీకే డైరెక్షన్ లో కేసీఆర్!
– బూతుల వెనుక పెద్ద ప్లాన్
– దేశాన్ని కాపాడే నేతనంటూ కలరింగ్!
– ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో…
– జాతీయ రాజకీయాల్లో పేరు కోసం పాట్లు!
రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ను మించిన వారు ఎవరూ లేరనేది గులాబీ వర్గం వాదన. మరి.. అంత ఇరగదీసే వ్యూహాలే ఆయన దగ్గర ఉంటే ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు నియమించుకున్నట్టు అనేది రాజకీయ పండితుల ప్రశ్న. మూడోసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గులాబీ బాస్.. పీకేనే నమ్ముకున్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నడూ లేనంతగా కేంద్రంపై ఎటాక్ చేశారని విశ్లేషణ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ గంటన్నర ప్రసంగిస్తే.. సారు మాత్రం తిట్టడానికే రెండున్నర గంటలు కేటాయించారు. పీకే ప్రణాళికలో భాగంగానే కేసీఆర్ అలా మాట్లాడారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
బూతులతో సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని చూసిన బీజేపీ నేతలు.. అవి అసహనంలో నుంచి భయంతో కూడుకున్న వ్యాఖ్యలని సెటైర్లు వేస్తున్నారు. సారు కుర్చీ కింద మట్టి కదులుతుండడంతో పీకే మార్క్ పాలిటిక్స్ కు తెర తీశారని చెబుతున్నారు. ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినా సరే… ఈ స్థాయిలో మీడియా సమావేశం పెట్టి కేంద్రాన్ని కేసీఆర్ తిట్టింది లేదు. కానీ.. బీజేపీతోనే తనకు ప్రమాదం పెరుగుతుండటంతో పీకే డైరెక్షన్ లో ఎటాక్ స్టార్ట్ చేశారని అంటున్నారు కమలనాథులు. అటు రాజకీయ పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలని కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. ఆఖరికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదంతా చూసిన విశ్లేషకులు దేశాన్ని కాపాడే నేత తానే అన్నట్లు సారు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అందుకే రాజ్యాంగాన్నే మార్చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. దేశ రాజకీయాలు తన వైపు చూడాలని ఉద్దేశంలో భాగంగానే ఇది జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష నేతలు జట్టు కట్టాలని ప్రయత్నాల్లో ఉన్నాయి. ఫ్రంట్ లేదు టెంట్ లేదని కేసీఆర్ చెబుతున్నా.. జాతీయ రాజకీయాలే టార్గెట్ గా పీకే ప్రణాళికల్లో ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. విపక్ష పార్టీలు ఏవీ ఆయన వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇలా సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ కావాలని భావించి ఉండొచ్చని విశ్లేషణ చేస్తున్నారు. అందుకే రాజ్యాంగం అంశాన్ని టచ్ చేస్తూ.. బీజేపీ నేతలను బూతులు తిట్టారని అంటున్నారు రాజకీయ పండితులు.