బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యా్మ్నాయ లేదా తృతీయ కూటమి ఏర్పాటు గురించి గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, అదెలా సాధ్యం? అనే ప్రశ్నలు వచ్చాయి. యూపీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బయటకు వచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాయా? అనే సందేహాలు వచ్చాయి. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ థర్డ్ ఫ్రంట్ అంశం తెర మీదకు వచ్చింది.
రెండు లేదా మూడు నెలల్లో దేశంలో సంచలనం సృష్టించబోతున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ సాగుతున్నది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సైలెంట్ గా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకు తీసుకురావడానికి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలను వాడుకోవాలనుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న అన్నా హజారేను ప్రాంతీయ పార్టీల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో మైలేజ్ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అలా 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ లేదా తృతీయ కూటమిగా అవతరించడం సులువవుతుందనే అంచనాకు కేసీఆర్ వచ్చారట.
ప్రాంతీయ పార్టీలను ఏకతాటిమీదకు తీసుకురావడం కోసం కేసీఆర్ ఇప్పటికే వరుసగా ప్రాంతీయ పార్టీల అధినేతలు కొందరిని కలిశారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామిలతో ఇప్పటికే కేసీఆర్ భేటీ అయ్యారు. త్వరలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం జూలైలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావాలనే వాదనను ప్రాంతీయ పార్టీ అధినేతల ముందర ఉంచి వారందరినీ ఒప్పించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమచారం. చూడాలి మరి..2024 లోక్ సభ ఎన్నికల వరకు కేసీఆర్ నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ మేరకు జరుగుతుందో..