గ్రేటర్ ఎన్నికల్లో పరాభవంతో రగిలిపోతున్న టీఆర్ఎస్‌కు.. బీజేపీపై పగ తీర్చుకునే అవకాశం వెనువెంటనే దొరికింది. కాషాయ పార్టీని ఏదో ఒకటి చేస్తే గానీ మనఃశాంతి లేదనుకుంటున్న గులాబీనేతలకు.. భారత్ బంద్ రూపంలో ఆ చాన్స్ ఎదురైంది. మొన్నటివరకు మాటమాత్రానికైనా వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడని టీఆర్ఎస్ .. ఇప్పుడు ఏకంగా రేపటి భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో బంద్ విజయవంతం చేసి.. సెగ చూపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు కూడా ఇచ్చింది. అవసరమైతే ఢిల్లీలో రైతులతో కలిసి నిరసనలో పాల్గొనాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
కేంద్రంపై పోరాటానికి టీఆర్ఎస్ వేసిన ప్లాన్ పర్‌ఫెక్ట్‌గానే ఉన్నా.. రాష్ట్రంలోని రైతుల సమస్యల సంగతేమిటో చెప్పాలని ఇక్కడి అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రిత సాగుతో తెలంగాణ రైతులని నిండా ముంచి… దేశవ్యాప్తంగా రైతు పోరాటం చేయడమేందుకని నిలదీస్తున్నారు. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వకుండా ..కేంద్రంతో సమరానికి సై అంటే నమ్మడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇవ్వకుండా.. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా… ఈ రాజకీయాలేంటి అని తీవ్రంగా మండిపడుతున్నారు. రేపు తెలంగాణ జరిగే బంద్ .. భారత్ బంద్ కాదని.. ముమ్మాటికి అది తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే బంద్ అని స్పష్టం చేస్తున్నారు.