– ఇన్నాళ్లూ చేసిన మోసాన్ని బయటపెడతారా?
– ఎన్నికలప్పుడు ఎలా మాయ చేస్తున్నారో చెప్తారా?
– ఉద్యోగాలపై అదిగో ఇదిగో అంటూ..
– నెట్టుకొస్తున్న తీరును వివరిస్తారా?
వనపర్తి జిల్లాలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా చిట్యాల మార్కెట్ యార్డును ప్రారంభించి.. తర్వాత మన ఊరు-మన బడి పైలాన్ ను ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్ భవనంతోపాటు టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
చివరగా పార్టీ బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్.. నిరుద్యోగులపై ఓ సస్పెన్స్ ట్రైలర్ ను వదిలారు. తెలంగాణ ఆవిష్కరణపై బుధవారం అసెంబ్లీలో చెప్పబోతున్నానని అన్నారు. కీలక ప్రకటన ఉంటుందని నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరారు. అయితే.. దీనిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
ఉద్యోగాలపై కీలక ప్రకటన చేస్తారని ఒకరు.. జాతీయ రాజకీయాలపై మాట్లాడతారని ఇంకొకరు.. నోటిఫికేషన్ల ప్రకటన చేసి నిరుద్యోగులకు వల వేసి.. జాతీయ రాజకీయాలపై మాట్లాడతారని మరొకరు.. ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ఇన్నాళ్లూ నిరుద్యోగులకు చేసిన మోసాన్ని వివరిస్తారా? ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక బహిరంగ సభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు కేసీఆర్. మోడీ ప్రభుత్వానికి ప్రజల అవసరాలు తెలియవని బుద్ధి చెప్పాలన్నారు. మూర్ఖంగా, మొండి పద్దతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పనికిమాలిన మత పిచ్చగాళ్లను కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. మనం ముందుకు పోవాలంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను, కమలం పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ మాదిరిగా బంగారు భారత్ దిశగా మడమ తిప్పకుండా ముందుకు వెళ్తానని చెప్పారు.
వనపర్తి జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని.. ఈ సందర్భంగా తాను రాసిన కవితను సభలో చదివి వినిపించారు.
తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదన్న కేసీఆర్.. తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలోనే ఐదింటిని ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని.. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి వచ్చారని చెప్పారు.
తెలంగాణకు పనుల కోసం 11 రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారన్న సీఎం.. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోందన్నారు. వనపర్తి మున్సిపాలిటీకి కోటి రూపాయలు ప్రకటించారు. అలాగే ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ సీఎం.