కొన్నేళ్ల నుంచి తెలంగాణలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది. పబ్స్ లో, పార్టీల్లో సైలెంట్ గా మత్తులో ప్రముఖులు, యువత జోగుతోంది. స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ దందాను సాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అదుపు కావడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ డ్రగ్స్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్ లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించారు సీఎం. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వినియోగంపై ఈమధ్యే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సినిమావాళ్లు, ప్రముఖులకు వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఎవరు దొరికినా వదిలేది లేదన్నారు. కొందరు బడా వ్యాపారులను అరెస్ట్ చేశారు. తాజాగా కేసీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్న వారు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.