ఆర్టీసీపై కేసీఆర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు..? ఆర్టీసీ నష్టాలను గట్టెక్కిస్తానంటూ గతంలో చేసిన వాఖ్యలు ఎందుకు నోటీ మాటలుగానే మిగిలిపోయాయి…? తాజా ప్రతిపాదనతో ఆర్టీసీలో ప్రైవేటుకు వేసిన రహాదారి ఎక్కడ వరకు వెళ్తుంది…? ఇప్పుడివే ప్రశ్నలు సగటు తెలంగాణవాదిని ఆలోచనలో పడేస్తున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీసీ సమ్మె చేసింది. కానీ ఆనాడు లేని సెల్ఫ్ డిస్మిస్ ఇప్పుడెందుకు చేశారు…? ఆనాడు ఉద్యోగులు అడిగిన దానికన్నా ఎక్కువగా 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేప్పుడు కేసీఆర్ చేసిన వాఖ్యలపై ఎందుకు నోరు మెదపటం లేదు… అంటే కేసీఆర్ ఆలోచనలు సంస్థ ప్రయోజనాలకంటే ఇతర అంశాలపై పడిందన్న వాదనలు బలంగా వినపడుతున్నాయి.
ఆర్టీసీని మూడు కార్పోరేషన్లుగా విభజించాలి. గ్రేటర్ హైదరాబాద్ వరకు ప్రత్యేక కార్పోరేషన్ ఉండాలి. ఇక మిగతా ప్రాంతాలకు రెండు కార్పోరేషన్లు ఉండాల్సిందే. జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక ఫండ్‌ను ఆర్టీసీకి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటాం అని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్ ఆర్టీసీ కార్పోరేషన్ జీహెచ్‌ఎంసీకి అనుబంధంగా ఉంటుంది. మన పక్క రాష్ట్రాల్లో ఇలాంటి ఫార్మూలానే అవలంభిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ అందుకోసం ఒక్క అడుగు కూడా వేయలేదు.
ఎంతలా అంటే… ఆర్టీసీకి ప్రత్యేకంగా ఉండాల్సిన ఎండీ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఆర్&బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఎంతో మంది మంచి అధికారులున్నా… వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న సర్కార్… ఇక్కడ ఇంచార్జీ పాలనతో నెట్టుకొస్తున్నారు.
ఇక, ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు కొత్త బస్‌స్టేషన్ల నిర్మాణం, ప్రస్తుతమున్న జూబ్లీ, ఎంజీబీఎస్… సహా రాష్ట్రంలో కొన్ని సెంటర్లను సినిమా థియేటర్లు, మాల్స్‌గా డెవలప్ చేసేందుకు అప్పట్లో ప్రయత్నాలు కూడా జరిగాయి. సిద్దిపేట బస్టాండ్‌లో థియేటర్‌కు సంబంధించిన బ్లూప్రింట్ కూడా రెడీ అయింది. జూబ్లీది అదే పరిస్థితి. కానీ పట్టాలెక్కలేదు… అందులో ఎవరి ఒత్తిడి ఉందో, ఎందుకు పక్కనపెట్టారో సర్కార్ పెద్దలే బయటపెట్టాలి.
ఇలా ఆర్టీసీ నష్టాలకు కేవలం ప్రయాణికుల అంశమే కారణం కాదని గతంలో వాధించిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు… ఇప్పుడు సంస్థను ప్రైవేటు పరం చేయటంలో ముందడుగు వేశారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 20శాతంతో ఎంట్రీ ఇచ్చి… క్రమేణ ఆ సంఖ్యను పెంచేయటం ప్రభుత్వాలకు అలవాటేనని, గతంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని మండిపడుతున్నారు.
ఆర్టీసీకి ఉన్న కోట్లాది విలువైన భూములను ఉపయోగించుకుంటే… ఆర్టీసీ మిగులు బడ్జేట్‌తో ఉంటుందని, కానీ లీజుల పేరుతో కేసీఆర్ సర్కార్… వాటిని మెల్లగా ప్రైవేటు పరం చేస్తుందని, ఇప్పుడా స్పీడ్ మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.