పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఎంపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో పాటు.. సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, పార్టీ వైఖరిపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రానికి కేంద్రం నెరవేర్చాల్సిన అంశాలు, విభజన చట్టంలోని హామీలు, పెండింగ్ సమస్యలు, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిపై ఎంపీలకు నివేదికలు అందించారు సీఎం. కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాను ఎంపీలకు వివరించారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పార్లమెంట్ లో మాట్లాడాలని వారికి చెప్పారు.
రైతు సమస్యలు, తెలుగు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు కేసీఆర్. రాష్ట్రానికి రావలసిన నిధులను వెంటనే మంజూరు చేసేలా కేంద్రంతో యుద్దాన్ని మొదలు పెట్టాలని ఎంపీలకు సూచించారు.