దేశవ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చర్చ నడుస్తోంది. కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే పన్ను మినహాయింపులు ఇస్తున్నారు. కేవలం 12 కోట్లతో రూపొందిన ఈ మూవీ.. వంద కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రధాని మోడీ, అమిత్ షా సహా దేశవ్యాప్తంగా చాలామంది నేతలకు ఈ సినిమా నచ్చింది. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన కేసీఆర్… కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ మూవీ విడుదలైందన్నారు.
కాశ్మీర్ ఫైల్స్ ను వదిలిపెట్టి మోడీ సర్కార్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు కేసీఆర్. రాష్ట్రంపై అనేక విషయాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ.. హిందూ పండిట్లను చంపినప్పుడు అధికారంలో ఉంది ఎవరనిని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వమే కదా అని గుర్తు చేశారు. దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్ మెంట్ ఫైల్స్ అని సెటైర్లు వేశారు.
ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఆనాటి గాయాలను మాన్పుతుందా? తిరిగి రేపుతుందా? అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ మాట్లాడారు.