– ప్రజల్లో వ్యతిరేకత..!
– ఉద్యమకారుల్లో అసంతృప్తి..!
– పార్టీ నేతల్లో అసహనం.!
– పీకే టీం సర్వేల్లో బయటపడ్డ నిజాలు..!
– పాలుపోని స్థితిలో కేసీఆర్!
దేశంలో లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. కేంద్రం వల్లే కానిది రాష్ట్రంలో చేసి చూపిస్తున్నాం.. మోడీ సర్కార్ సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నాం.. ఇవన్నీ టీఆర్‌ఎస్ నేతలు కొద్దిరోజులుగా వల్లెవేస్తున్న మాటలు. అదే పనిగా దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. చాలా అందంగా నవ్వుతూ ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఇదిగో అభివృద్ధి అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం పక్కా అని ధీమాగా ఉన్నారు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయనేది రాజకీయ పండితుల వాదన.
తన వ్యూహాలతో రెండు పర్యాయాలు నెట్టుకొచ్చిన కేసీఆర్.. ఈసారి పీకేపై భారం వేశారు. ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవుతూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో పీకే టీం.. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులపై అనేక సర్వేలు చేసిందట. ఏదో మూడు, నాలుగు సర్వేలు కాదు.. ఏకంగా 20కి పైగా సర్వేలు చేసి అన్ని విషయాలను తెలుసుకుందని టాక్. ఈ క్రమంలోనే అసలు నిజాలు ఏంటో కేసీఆర్ కు తెలిసి షాక్ తిన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.
పీకే టీం సర్వేల్లో మెయిన్ గా కనిపించింది మూడు ప్రధానాంశాలట. ఒకటి ప్రజల్లో వ్యతిరేకత, రెండోది ప్రభుత్వంపై ఉద్యమకారుల అసంతృప్తి, మూడోది పార్టీ నేతల్లో అసహనం.. ఈ కారణాలతోనే మూడోసారి అధికార పీఠం కష్టమనే సంకేతాలు వచ్చాయట. దీంతో పూర్తి వివరాల్ని కేసీఆర్ ముంగిట పెట్టారట పీకే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని హెచ్చరించారట.
పార్టీలో జిల్లాల వారీగా ఉన్న గ్రూప్ తగాదాలతో ఎక్కువ నష్టం జరుగుతోందని కేసీఆర్ కు పీకే వివరించినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ప్రతిపక్షమే లేకుండా చేద్దామని ఎవరిబడితే వారిని పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్. ఫలితంగా కారు ఓవర్ లోడ్ అయింది. దీనికితోడు ముందు నుంచి తెలంగాణ కోసం కొట్లాడినవారిని కాదని.. మధ్యలో వచ్చిన వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టడంపై చాలామంది నేతలు అసహనంతో రగిలిపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అటు పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతున్నారని కూడా తేలిందట. వీటన్నింటితోపాటు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత వ్యక్తం అయినట్లు కేసీఆర్ కు పీకే వివరించినట్టుగా చెబుతున్నారు రాజకీయ పండితులు.