సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘భారతమాల పరియోజన’ కార్యక్రమం కింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.
మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుంచి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటి నుంచి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.
అదే 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మిచడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల భారత ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించి ఇచ్చిన యెడల ఆయా రహదారి ప్రాజెక్టులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుగా ఉంటుందన్నారు. తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుందని లేఖలో తెలిపారు.
కావున ఈ విషయంలో కేసీఆర్ వ్యక్తిగతంగా చొరవ చూపించి, ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వీలుగా చర్యలు తీసుకోగలరని కిషన్ రెడ్డి కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపారు.