‘మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. ఆచరణ గడప దాటదు’ అన్నట్టుగా కేసీఆర్ సర్కార్ పని తీరు వుందని అంటున్నాయ్ విపక్షాలు. ఒక పక్క ఆర్థిక మాంద్యంతో ఉన్న పథకాలకే అరకొరగా నిధులు కేటాయించారు ఈ బడ్జెట్లో అని విపక్ష నేతలు పెదవి విరుస్తుంటే, మా దగ్గర ఇంకా రెండు పథకాలు ఉన్నాయ్, వాటిని అమలు చేస్తే మీ పని ఫినిష్ అంటూ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడటం చూస్తే ఎత్తులకు హెచ్చులు ఎక్కువ అన్న సామెత గుర్తుకొస్తుంది. ఈ విషయం కూడా కేసీఆరే సభలో చెప్పారని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
లేస్తే మనిషిని కాదు.. నేను ఏమి చెప్పినా జరిగి తీరుతుంది.. మేమే మరో రెండు టెర్ములు అధికారంలో ఉంటాం.. అంటూ కేసీఆర్ సభలో మాట్లడటం చూస్తుంటే తన డబ్బా తానే కొట్టుకుంటున్నట్లుంది అంటున్నారు ప్రతిపక్ష నేతలు. మరోవైపు కేసీఆరే ఆర్థికమాంద్యం వలన ఇంకా నిధుల కేటాయింపు తగ్గొచ్చు అంటూనే, నా దగ్గర మరో రెండు బ్రహ్మాస్త్రాలు ఉన్నాయింటూ బీరాలు పలకడం చూస్తుంటే తుపాకీ రాముడు మాటలు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీయబోయే సినిమా టైటిల్ ఇది. బహుశా వాళ్ళ బాస్ మాటలను వినే తుపాకీ రాముడు సినిమా తీస్తున్నడేమో అని విపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.ఇప్పటికే రైతుబంధు పథకం కింద రైతులకు అందాల్సిన డబ్బులు అందడంలేదు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద అందాల్సిన నగదు చాలా లేటుగా అందుతున్నాయి.అర్హులైన కొందరికి అసలు ఆ పథకం అందడంలేదు అని విమర్శిస్తున్నారు. ఇదే విషయం అసెంబ్లీలో ప్రస్తావిస్తే మానోరు నొక్కారని కాంగ్రెస్ పక్షనాయకుడు భట్టి మండిపడ్డారు. బిల్లులు రాక చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఈయన నా దగ్గర మరో రెండు పథకాలు ఉన్నాయి, వాటిని అమలు చేస్తే మీ అడ్రస్సుఉండదని మమ్మల్ని బెదిరించడం చూస్తుంటే గ్రామాలు తిరుగుతు మాటలు చెప్పే పిట్టలదొరలు గుర్తుకొస్తున్నారు అంటున్నాయి విపక్షాలు.ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులు పాలుచేసింది చాలక మరో రెండు పథకాలను తెస్తాడంట అంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో ఇవ్వడమే కష్టంగా ఉన్న పరిస్థితులలో ఐఆర్ అన్నారు,పీఆర్సీ అన్నారు, ఇప్పటివరకు ఏదీ ఉద్యోగులకు చేయలేదు.నష్టాలలో ఉన్న ఆర్టీసి కార్మికుల పరిస్థితి, సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. దీని గురించి ఆలోచించకుండా నా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, వాటిని అమలు చేస్తే విపక్షాలు ఫినిష్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లడడం చూస్తుంటే ఆయనకు ఓట్లు సీట్లు అధికారం తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ఉద్యోగుల సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరకక బాధ పడుతున్న యువకుల సమస్యలు,జనం కష్టాలు పట్టవు అంటూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. రైతు రుణమాఫీ ఇప్పటికి జరగక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేస్తున్నారు.వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు బాగుచేసుకోవాడానికి నిధులు లేక వాటిని అలాగే వదిలేశారు. దీనితో వాహనదారులు నానా అవస్థలుపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలలో అనేకమంది మృతి చెందుతున్నారని గుర్తుచేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే మిషన్ కాకతీయ కింద పనిచేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లులకు దిక్కులేదు. ఆరోగ్యశ్రీ కిందహాస్పిటల్స్‌కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడానికి నిధులులేవు. సీఎంఆర్‌ఆఫ్‌కి భారీగా కోత విధించారు. దీనితో పేదలు వైద్యం చేయించుకోలేక అప్పులపాలు కావడమో, లేక మృత్యువాత పడటమో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ వీటి గురించి ఆలోచిస్తే మంచిది. కొత్త పథకాలను తెచ్చి విపక్షాలను ఫినిష్ చేసే ఆలోచనలను మానుకోవాలని హితవుపలుకుతున్నారు.