అసెంబ్లీ వేదికగా కేసీఆర్ హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు బానేవుంది. కానీ, ఈ ప్రసంగం ఊకదంపుడు ధోరణితో, దబాయింపుతో సాగింది. తామే రెండోసారి అధికారంలోకి వచ్చామన్న సంగతి మరచి మాట్లాడినట్లు ఉంది. ఎందుకంటే ప్రతి దానికి గత ప్రభుత్వాలు అంటూ సంబోధించారు.. అంటే గత ఐదు సంత్సరాలుగా తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంగతి మరిచారా.. లేక తప్పులన్నీ ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేశారా?
అసెంబ్లీలో అప్రప్రెషన్ బిల్లు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏమి చేసాయి అంటూ ఏకరవు పెట్టారు. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. దీనివెనుక కేసీఆర్ వ్వుహం ఏమిటి? ఎందుకు అప్రప్రెషన్ బిల్లును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేశాడు. బిల్లు మీద మాట్లాడాల్సిన సీయం బిల్లు గురించి కాకుండా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాధ్యాన్యతల గురించి, నిధుల కేటాయింపు గురించి మాట్లడకుండా, ‘సుదీర్ఘకాలం మీరే కదా అధికారంలో ఉంది’ అంటూ కాంగ్రెస్‌ని, బీజేపీని టార్గెట్ చేశారు.
‘మీ హయాంలోనే నక్సలిజం పుట్టుకొచ్జింది. మీ పాలన పుణ్యమే అవినీతి. మీ పాలన పుణ్యమే కల్తీ. మీ పాలన పుణ్యమే అప్పులు. మీరు అప్పులు చేయాలేదా.. అప్పులు చేసిందే మీరు. అక్రమాలు చేసిందే మీరు. మీరు నిర్మించిన ప్రాజెక్టులన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. మేము ప్రవేశపెట్టిన పధకాలు దేశంలో ఎక్కడా లేవు. బీజేపీ వాళ్లు రేపే అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే ఉన్న పథకాలు రద్దు అవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు. దేశంలో ఆర్థిక మాంధ్యానికి కారణం మోడీ పాలనే..’ అంటూ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ను ఎడాపెడా విమర్శించారు. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకుంది మేమే అంటూ మరోసారి తెలంగాణ సెంటిమెంటుని రగిలించే ప్రయత్నం చేసి బ్రాండింగ్ చేసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సర్వరోగాలకు మీరే కారణం అంటూ తన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తూనే తన వలన జరిగిన తప్పులను, వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఏడు స్థానాలను పొగొట్టుకున్న టీఆరెస్ ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలలో ఓటమి చవిచూస్తే పార్టీలో తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రహించిన కేసీఆర్ తన పాలనలో జరిగిన, జరుగుతున్న పొరపాట్లకు కారణం గత ప్రభుత్వాలే అని చెప్పే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే కాంగ్రెస్- బీజేపీ దొందు దొందే, ఇద్దరు ఒకటే, వీరిద్దరి మధ్యా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, వీరు చేతులు కలుపుకుంటారు అంటూ మరోసారి ఫెడరల్ ఫ్రెంట్ నినాదాన్ని ఎత్తుకున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ ఉపన్యాసం ఎత్తుకున్నట్లు. ఈ ఉపన్యాసం వెనుక హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఉంది. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని అసెంబ్లీ వేదికగా పూరించారు. దీనికి అప్రప్రేషన్ బిల్లు సందర్భాన్ని వాడుకున్నారు. నిన్నటిదాకా బీజేపీని బలపరిచిన టీఆరెస్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోంది.? జీఎస్‌టీకి,పెద్దనోట్ల రద్దుకి అన్ని రాష్ట్రాలకన్నా ముందు అసెంబ్లీలో తీర్మానం చేసింది టీఆర్ఎస్ సర్కార్. నిన్న కాక మొన్న తలాక్ బిల్లుకి, రైట్ టు ఇన్ఫర్మేషన్ సవరణ బిల్లుకు, 370 ఆర్టికల్‌కి మద్దతు ఇచ్చారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చి తల్లిని చంపి బిడ్డను రక్షించారు. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పెట్టారు, తెలంగాణను ఇచ్చిన వాళ్ళే దేశాన్ని విభజించాలని చూస్తున్నారు అంటూ అనేక సార్లు మాట్లడినా ఎప్పుడూ ఎక్కడా ఖండించని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడినట్లు? జీఎస్‌టీని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? పైగా మేమే మొట్ట మొదటిసారిగా జీఎస్‌టీని వ్యతిరేకించామంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వం మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, ప్రజలు ఎంతవరకు ఈ విషయాన్ని గ్రహిస్తారో చూడాలని విశ్లేషకులు అంటున్నారు. ఇక విపక్షాలు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన విమర్శలను ఎలా తిప్పికొడతాయన్నది మరో అంశం. ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి ఎలా తీసుకునిపోతాయనేదానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.