బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలే తిరస్కరించారని ఇక ఆ పార్టీ విస్తరణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీఆర్ఎస్ లోకి ఏపీ నేతల చేరికలపై మంగళవారం డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడన్నారు. గతంలో సీఎం కేసీఆర్ మాట్లాడితే ఏం చెప్పబోతున్నారో అని అందరూ వినేవాళ్లు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్లు, స్పీచ్ లు కామెడీ షోగా మారిపోయాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో మూతబడిన సంస్థలను తెరవకుండా.. దేశాన్ని ఉద్దరిస్తారా? అంటూ నిలదీశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా, తెలంగాణ సాధించుకున్న లక్ష్యాన్నే సీఎం మర్చిపోయారని అన్నారు.
అలాంటి కేసీఆర్ ఇక దేశాన్ని ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్దాలు తెలంగాణ ప్రజలకు అర్థం అయిపోయిందని, దీంతో బీఆర్ఎస్ పేరుతో అబద్దాలు చెప్పి మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
తెలంగాణ సెంటిమెంట్ తో ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడంతో పాటు గతంలో చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే అనేక రకాలుగా .. అబద్దాలతో సెంటిమెంట్ ను రాజేసి వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ జూటా మాటలు ప్రజలకు అర్థం అయ్యాయన్నారు. కేసీఆర్ నిజస్వరూపం ఏంటో.. ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు డీకే అరుణ.