– మరో కొత్త పథకంపై సీఎం ఫోకస్
– సొంత జాగా ఉన్నవారికి 3 లక్షల సాయం
– ఈనెల 10న కేబినెట్ భేటీ
– ఎన్నికలే టార్గెట్ గా కీలక అంశాలపై చర్చ
– ఈడీ, ఐటీ దాడులు, సీబీఐ సోదాలపైనా ఫోకస్
– సీఎం స్పీడ్ చూసి.. ముందస్తు అనుమానాలు!
మరో కొత్త పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈనెల 10 వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కేసీఆర్ సిద్దమైనట్టు సమాచారం. ఆయన అధ్యక్షతన జరగనున్న ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా.. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు, నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళితబంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఈడీ, ఐటీ దాడులు, సీబీఐ సోదాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే రానున్న ఎన్నికలకు ముందే కేసీఆర్ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం
చుట్టనున్నారు. సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం పథకం అమలు చేయనున్నారు.
సొంత స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేయనుంది. 10న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడనుంది. అన్ని నియోజక వర్గాల్లో అర్హులను గుర్తించి.. 15 రోజుల్లోనే నిధులను విడుదల చేసే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ముందస్తు కోసమే కేసీఆర్ స్పీడ్ పెంచి.. కొత్త ప్రభుత్వ పథకాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ కేబినెట్ భేటీలో వీటితోపాటు పలు కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను వాడుకోవడంపై చర్చించనున్నారు. రుణాల్లో కోత, పథకాలకు నిధులు ఇవ్వకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, కృష్ణా జలాల విభజనలో జాప్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే
అవకాశముంది. అదే విధంగా అసెంబ్లీ సమావేశాల తేదీలను, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. మొత్తానికి కేసీఆర్ స్పీడ్ ను చూస్తుంటే.. ఎన్నికలకు రంగాన్ని సిద్దం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ వేగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు రెడీ అవుతున్నాయి.