– ఏపీ వ్యాపారవేత్తలను దువ్వుతున్న కేసీఆర్
– క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనూ వ్యూహాలు
– బీసీలను లైన్ లో పెట్టేందుకు ప్రణాళికలు
– ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు?
– ఇతర పార్టీల నాయకులకు గాలం
– ఏపీలో బీఆర్ఎస్ ఎదుగుదలకు స్కోప్ ఉందా?
– ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ
– ఒక్క ఛాన్స్ అంటూ బీజేపీ హడావుడి
– బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా?
బీఆర్ఎస్ కు జాతీయ హోదా కల్పించాలి.. ప్రస్తుతం కేసీఆర్ ముందున్నఛాలెంజ్ ఇదే. తెలంగాణను దాటి ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం ఇప్పుడు చాలా అవసరం. కానీ, ఇది సాధ్యం అయ్యే పని కాదని మొదట్నుంచి విమర్శలు ఉన్నాయి. కానీ, గులాబీ నేతల కాన్ఫిడెన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాగే వెక్కిరించారని చివరకు తమ బాస్ రాష్ట్రాన్ని సాధించారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు వేరనే వాదన జరుగుతోంది. కేసీఆర్ మొదటి టార్గెట్ గా చెబుతున్న ఏపీలో పరిస్థితులనే వివరిస్తూ ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారం అని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ పండితులు.
ఏపీపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారని రెండు రోజులుగా తెగ ప్రచారం సాగుతోంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీల్లోని నేతలతో గులాబీ నేతల సంప్రదింపులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఏపీలో పార్టీని విస్తరించాలంటే.. జనసేన మాదిరి కొత్త రాజకీయ నాయకులను పుట్టించడం కేసీఆర్ కు కుదరని పని. తెలంగాణలో మాదిరిగా ఇతర పార్టీల నేతలను లాగేసుకోవడం, ఏదో ఒక పార్టీతో జట్టుకట్టడం తప్పదు. కేంద్రంలోని బీజేపీ నేతలతో యుద్ధం అని అంటున్నారు కాబట్టి.. ఆపార్టీ నేతలకు గాలం వేయడం తప్ప కలిసే ఛాన్స్ లేదు. అయితే, కమలనాథులు దీనిపై ఇప్పటికే స్పందించారు. మా పార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని సవాల్ కూడా చేశారు. ఈ వ్యవహారం పక్కనపెడితే మిగిలిన టీడీపీ, వైసీపీ, జనసేనతో సంప్రదింపుల కోసం కేసీఆర్ ముగ్గురు నేతలను రంగంలోకి దింపినట్లుగా చెబుతున్నారు.
కొందరు టీడీపీ నేతలతో కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో పసుపు జెండా పట్టుకునే కేసీఆర్ ఓట్లు అడిగారు. ఇప్పుడు ఆ పరిచయాలను క్యాష్ చేసుకోవాలన సారు చూస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజికవర్గంలోని నేతలతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సీనియర్ నేత గతంలో చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పని చేసారు. ఇప్పుడు ఆయన పేరు ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించే వారిలో ప్రధానంగా ప్రచారంలో ఉంది. అదే విధంగా వైసీపీ నేతలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాటే మంత్రి తలసానికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అదీగాక ఆయనకు సామాజికంగానూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు నేతలను రంగంలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది.
నిజానికి ఏపీ రాజకీయాలు వేరు. అక్కడ కుల ప్రాతిపదికన వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే స్ట్రాటజీతో వెళ్తున్నారని అంచనా వేస్తున్నారు. ఓవైపు ఇతర పార్టీల నేతలను దువ్వుతూనే.. ఇంకోవైపు బీసీ ఓటర్లకు గాలం వేసేలా వ్యూహాలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో టీడీపీకి బీసీల బలం ఎక్కువ, అందుకే వైసీపీ గత ఎన్నికల్లో వాళ్లను మచ్చిక చేసుకోవడంలో సఫలం అయింది. అధిక సీట్లు సాధించింది. అయితే, గత టీడీపీ, కాంగ్రెస్, ఇప్పటి వైసీపీ పాలనలో బీసీల్లో ఉన్న అన్ని వర్గాలు అభివృద్ధి సాధించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ బీఆర్ఎస్ బాధ్యతలను బీసీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే గనక జరిగితే టీడీపీ, వైసీపీ నష్టం తప్పదు. తన కింద పని చేసిన కేసీఆర్ ను పైకి లేపేందుకు చంద్రబాబు ప్రయత్నించే ఛాన్స్ ఉండదు కాబట్టి వైసీపీ బీఆర్ఎస్ కు దగ్గరయినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. వైసీపీ లీడర్లలో అధిక శాతం మంది ఆస్తులన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. అంటే.. అంతా కేసీఆర్ చేతిలో ఉన్నట్లే. అందుకే తెలంగాణ మంత్రులు తెగ తిడుతున్నా రెండు రోజులు హడావుడి చేసిన వైసీపీ నేతలు తర్వాత సైలెంట్ అయిపోయారని అనుమానిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని ఏపీ వ్యాపారలను కూడా కేసీఆర్ లైన్ లో పెట్టుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆర్థికంగా బీఆర్ఎస్ ఏపీలో బలం పెంచుకునేందుకు దారి దొరికినట్లేనని అంచనా వేస్తున్నారు.
ఇలా అన్ని అస్త్రాలను ప్రయోగిస్తూ.. కేసీఆర్ ఆంధ్రాలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. అయితే, ఈ సందర్భంగా బీజేపీ వర్గాలు కేసీఆర్ గతంలో ఆంధ్రావాళ్లను తిట్టిన తిట్లను గుర్తు చేస్తూ డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. పేడ బిర్యానీ అంటూ ఆంధ్రావాళ్లను హేళన చేసిన కేసీఆర్ కామెంట్స్ ను గుర్తు చేస్తూ.. జనాల్లో సెంటిమెంట్ ను రగిలిస్తే.. బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.