సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కేసీఆర్‌లో మరో అపరిచితుడు బయటికొస్తాడు. వందమంది ప్రశాంత్‌కిశోర్‌లు కూడా అప్పుడు అతనికి సమానం కాదు. సెంటిమెంట్ రాజేస్తాడు. లేదా సడెన్‌గా అందరి ‘బంధు’వు అయిపోతాడు. మాయ చేసైనా గంప గుత్తగా ఓట్లు లాగేస్తాడు. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముందు కూడా కేసీఆర్‌లో అపరిచితుడు లేచాడు..లేచి ‘రైతు బంధు’ బయటికి తీశాడు…అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
ఉపఎన్నిక ముందు కేసీఆర్ మరోసారి తన పాత వ్యూహానికి మళ్లీ పదును పెడుతున్నారని అటు విమర్శకులు, ఇటు పరిశీలకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని హిట్ ఫార్ములా తీసుకొచ్చి కేసీఆర్ ఇప్పుడు హుజూరాబాద్‌కు అప్లయ్ చేస్తున్నారని వారు చెబుతున్న మాటల సారాంశం.
‘రైతు బంధు’ ఏదీ అని ఎవరడిగినా ఇంతకాలం సమాధానం చెప్పని టీఆర్ఎస్ నేత ఇప్పుడు ఉప ఎన్నికకు ముందు సడెన్‌గా దాన్ని బయటికి తీస్తున్నాడంటే దానర్ధం ఏంటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులపై ప్రేమ పుట్టుకురావడం వెనుక రీజన్ వేరే ఇంకేంలేదని అంటున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి.. చివరకు ఓట్లు వేయడానికి క్యూ లైన్లో నిల్చున్న సమయం వరకు ‘రైతుబంధు’ పథకం డబ్బులు అకౌంట్లో పడ్డట్లు మెసెజ్‌లు వస్తూనే వున్నాయి. దానివల్ల రైతులు చాలా మంది ప్రభుత్వానికి గుడ్డిగా ఓటేశారు. ఇది ఓ రకంగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినట్లేనని విపక్షాలు ఆరోపించినా కేసీఆర్ లక్ష్యపెట్టలేదు. ప్రభుత్వం పేరుతో వచ్చిన పర్సనల్ ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సందేశాలు కాబట్టి.. ప్రతిపక్షాల ఫోకస్ అటు పడలేదు. వాళ్లకు అర్ధమయ్యేలోపు జరగాల్సింది జరిగిపోయింది. ముఖ్యంగా ఊగిసలాటలో ఉన్న ఓట్లు, క్యూలైన్ వచ్చిన తర్వాత జనం మూడ్‌ను బట్టి వేసే ఓట్లు కూడా అధిక సంఖ్యలోనే ఉంటాయి. అలాంటి ఓట్లన్నీ కూడా సంక్షిప్త సందేశాల పుణ్యమా అని గంపగుత్తగా టీఆర్ఎస్‌కు పడ్డాయి. చాలా చోట్ల రెండు వేల లోపు మెజారిటీతో ఓడిన సీట్లన్నీ అలా మిస్సయినవే అంటూ కాంగ్రెస్ తర్వాత తీరిగ్గా బాధపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..? అని సరిపెట్టుకుంది. ఇదంతా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరుగులేని వ్యూహంగా తర్వాత అందరికీ అర్ధమైంది కానీ, అప్పటికి చేసేది లేకపోయింది. కానీ, అప్పటి ఫలితాల నుంచి ప్రతిపక్షాలేవీ గుణపాఠం నేర్చుకున్నట్లు కనపడటం లేదు.
ఈ నెల 23 నుండే నామినేషన్ల పర్వం మొదలైంది. సరిగ్గా అదే రోజు నుంచి ‘రైతుబంధు’ స్కీమ్ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఇవ్వకుండా, సరిగ్గా మళ్లీ ఎన్నికలు రాగానే ‘రైతుబంధు’ మనీ రిలీజ్ చేయటం ప్రజలను ప్రలోభ పెట్టడంలో భాగమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే, అధికారికంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కలిస్తే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయలేరు.
ఈసారి అధికార పార్టీ సరికొత్త స్ట్రాటజీతో వెళ్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒక్క రైతుబంధు పథకంతో మాత్రమే ప్రలోభాలు ఉంటాయని అనుకోవద్దని, కచ్చితంగా హుజూర్‌నగర్ ఉపఎన్నికలో మరికొన్ని తాయిలాలు కూడా వుంటాయని అంటున్నారు. ప్రతి చోటా పాత పథకాల పేరిట నగదు రూపేణా, వస్తు రూపేణా ప్రలోభాలు కంటిన్యూ అవుతాయని అనుమానిస్తున్నారు.
ఇటు ప్రతిపక్షాల్లోని కొంతమంది కీలక నేతలు ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని, కేసీఆర్ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం మీద నిఘా ఉంచకుండా ఈ నేతలు సైలెంట్ మోడ్‌లో ఉంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఈసారి కూడా రైతుబంధు టీఆర్ఎస్‌ను గెలిపిస్తే అది కచ్చితంగా విపక్షాల చేతకానితనమే అవుతుంది.