– కుర్చీ వేసుకుంటానన్నారు..
– పోడు భూములకు పట్టాలిస్తానన్నారు
– సారు.. కుర్చీ వేసుకున్నదీ లేదు..
– పట్టాలిచ్చింది లేదు
– దాడులు జరుగుతున్నా పట్టింపు లేదు!
– గిరిజనులంటే కేసీఆర్ కు చిన్నచూపా?
– రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బయటపడిందా?
– ముర్మును కాదని సిన్హాకు సపోర్ట్.. దేనికి సంకేతం?
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఎన్డీఏ అనూహ్యంగా గిరిజన నేత ముర్మును రంగంలోకి దింపడంతో ఏకగ్రీవం ప్రచారం జరిగింది. నడ్డా, రాజ్ నాథ్ సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలకే జై కొట్టాయి. తమ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా చేత నామినేషన్ దాఖలు చేయించాయి. పార్లమెంట్ లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ వెంట ప్రతిపక్షాల ప్రధాన నాయకులు ఉన్నారు. ఇక్కడే ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. నాయకులంతా వరుసగా కుర్చున్నారు. యశ్వంత్ కు అటూ ఇటూ రాహుల్ గాంధీ, శరద్ పవార్ ఉండగా.. ఆయన పక్కనే అఖిలేష్.. అటు పక్క తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
కాంగ్రెస్ పేరెత్తితే చాలు అంతెత్తున లేచే కేటీఆర్.. హస్తం పార్టీ మద్దతుతో బరిలో నిలబడ్డ యశ్వంత్ కు జై కొట్టారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంటే.. ఇంకోవైపు ఆ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసిపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ రెండు పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తోంది. పైకి తిట్టుకున్నా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒకటేనని జనాల్లోకి తీసుకెళ్తోంది. పైగా.. కాంగ్రెస్ నేతలకు ఓట్లేస్తే వాళ్లు ఆ పార్టీలో ఉంటారో.. టీఆర్‌ఎస్ లోకి వెళ్తారో ఆలోచించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ పక్కనే కేటీఆర్ కనిపించడంతో విమర్శల దాడిని మరింత స్పీడప్ చేస్తోంది.
ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబడింది గిరిజన నేత ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా ఉంది. జాతీయ రాజకీయాల జపం చేస్తున్న ఆయన… సొంతంగా అభ్యర్థిని నిలబెడతారా? లేక.. కాంగ్రెస్ మద్దతు తెలిపిన సిన్హాకు జై కొడతారా? అలాకాకుండా ఎన్డీఏ నిలబెట్టిన గిరిజన నేతకు సపోర్ట్ చేస్తారా? అని ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. చివరకు కాంగ్రెస్ అండగా ఉన్న అభ్యర్థికే సపోర్ట్ చేశారు. దీంతో కేసీఆర్ కు గిరిజనులపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోందని.. పాత విషయాలను కూడా తవ్వుతున్నారు బీజేపీ నేతలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోడు భూముల విషయంలో కేసీఆర్ తీరును అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తరచూ తప్పుబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. పోడు భూమలకు కుర్చీ వేసుకుని మరీ.. పట్టాలిస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. కానీ.. 8 ఏళ్లలో ఆయన కుర్చీ వేసుకున్నదీ లేదు. పట్టాలు ఇచ్చింది లేదు. దీనిపై నిలదీస్తూ అప్పుడప్పుడు గిరిజనులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి ఇవి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పైగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం కూడా భద్రాద్రి జిల్లాలో ఓ ఘటన వెలుగుచూసింది. ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ ఏనాడూ గిరిజనుల సమస్యలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
ఆదివాసీలను గాలికొదిలేసి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ప్రతిపక్షాలు తరచూ మండిపడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఎన్డీఏ నిలబెట్టిన గిరిజన నేతకు కేసీఆర్ మద్దతు తెలిపకపోవడంపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనులపై ఆయనకున్న ప్రేమ ఏంటో దీన్నిబట్టి తేలిపోయిందని అంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎంత పగ ఉన్నా కానీ.. గిరిజన నేతను గౌరవించాలని తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలోని గిరిజనులు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుట్రను గ్రహించాలని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాయి బీజేపీ వర్గాలు. మరోవైపు రేవంత్ రెడ్డిపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకటేనని చెప్పే రేవంత్.. ఇప్పుడేమంటారని నిలదీస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దోస్తులు ఎవరో తేలిపోయిందని చురకలంటిస్తున్నాయి.