టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.గులాబీ పార్టీపై,తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకునేందుకు వారికి మంచి అవకాశం వచ్చింది.టీఆర్ఎస్ కోసం సర్వం ధారపోసి అప్పులపాలై, ఉన్నఆస్తిని కూడా లోకల్ రౌడీ షీటర్ ఒకరు ఆక్రమించుకోవడంతో దిక్కులేనివాడయిన ఓ లోకల్ లీడర్ సమస్య ఇది.మంచిర్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్ రెడ్డి గతంలో కేసీఆర్‌పై వీరాభిమానంతో నిర్మించిన కేసీఆర్ గుడిని తాజాగా అమ్మకానికి పెట్టాడు. ఔత్సాహికులెవరైనా కొనుగోలు చేయవచ్చని ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెట్టాడు.ఆసక్తి గలవారు 98668 85308 నెంబర్లో సంప్రదించవచ్చని అందులో వివరించాడు.
దండేపల్లికి చెందిన గుండా రవీందర్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేశాడు.టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా..అందులో పాల్గొని, విజయవంతం చేసేందుకు తీవ్రంగా కష్టపడేవాడు.ఈ క్రమంలో ఆస్తులన్నింటిని అమ్ముకోవడమేగాక..30కిపైగా బైండోవర్ కేసుల్లో పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి ఇబ్బందులపాలయ్యాడు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ అంటే అభిమానాన్ని మాత్రం దాచుకోలేకపోయాడు.ఈ క్రమంలో రూ.3లక్షలు వెచ్చించి,కేసీఆర్,తెలంగాణ తల్లి,ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలతో కూడిన ఓ గుడిని నిర్మించి సంచలనంగా మారాడు.
తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న రవీందర్ రెడ్డి.. ఇప్పుడు తీవ్ర కష్టాల్లో మునిగిపోయాడు.ఆయన నడిపించే ఒక కేబుల్ నెట్వర్క్ ను రౌడీ షీటర్ మౌలానా ఆక్రమించుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే,ఎంపీకి విన్నవించుకున్నాపట్టించుకోలేదు. పోలీస్ కంప్లైంట్ చేసినా ఎలాంటి సహాయం చేయలేదు. చివరకు ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసినా న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమకారుడినైనా తనకు ఎలాంటి సాయం చేయకపోగా.. కనీసం తన ఆస్తిని కబ్జా చేస్తుంటే కూడా ఎవరూ పట్టించుకోకపోవడంపై రవీందర్ రెడ్డి తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో గుడిని అమ్ముతున్నట్టు ప్రకటన చేశాడు.
వాస్తవానికి గతంలోనే ఈ విగ్రహానికి ముసుగు వేశాడు రవీందర్. ఈ సారి ఏకంగా అమ్మకానికి పెట్టాడు. రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.