హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. ముందు నుంచి ఊహిస్తున్నట్టే టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు అయన పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. గెల్లుకే హుజురాబాద్ టికెట్ అని తొలివెలుగు ముందు నుంచే చెబుతోంది. గెల్లుకే టికెట్ ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారో అన్నదానిపై సవివర కథనాన్ని కూడా అందించింది.
గెల్లు శ్రీనివాస్‌ది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ప్రస్తుతం పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. గతలో వివిధ విధ్యార్థి పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఈక్రమంలో తొలుత హైదరాబాద్ టీఆర్ఎస్వీ పట్టణ కార్యదర్శిగా పనిచేశారు. ఆతర్వాత గెల్లును 2010లో ఓయూ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా నియమించారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు పనిచేస్తున్నారు. అటు దళిత బంధుతో ఎస్సీల ఓట్లను.. ఇటు బీసీ అభ్యర్థి గెల్లుతో బీసీ ఓట్లను సంపాదించుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గెల్లు పేరును ప్రకటించారని అంతా అంచనా వేస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గతంలో ఈటలకు అనుచరుడిగా పనిశారు. ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒకరకంగా ఇప్పుడు గెల్లు.. తన గురువుతోనే పోటీపడుతున్నట్టవుతోంది. దీంతో హుజురాబాద్ పోరు మరింత రసవత్తరంగా మారేలా ఉంది.
మరోవైపు ఏదైనా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత 48 గంటల్లోగా ఆతనిపై ఉన్న కేసుల వివరాలను ప్రకటించాలని తాజాగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో.. గెల్లు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. గెల్లుపై గతంలో 100కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో ఎన్నింటిపై విచారణ కొనసాగుతుందో ఇంకా స్పష్టత లేదు.