సీఎం కేసీఆర్ ఈనెల 14 న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టును మరో యాదాద్రి చేయాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్రం.. ఆంజనేయస్వామి ఆలయ అభివద్ధికి ఇటీవల 100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు బడ్జెట్ లోనూ నిధులు కేటాయించారు పాలకులు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ 14న ఆలయానికి చేరుకొని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
అయితే ఘాట్ రోడ్ తో పాటు వసతి గదులపై కూడా దృష్టి పెట్టనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే నిరంతర తాగునీటి సరఫరా, అనుబంధ ఆలయాల అభివృద్ధి, పార్కింగ్ వంటి పలు రకాల సదుపాయాలను సైతం మెరుగుపర్చనున్నారు. అంతే కాకుండా ఆలయ క్షేత్ర పరిధిలో ఉండే కోతుల ఆహారం కోసం ఫుడ్ పార్క్ లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్దమయ్యాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ప్రసిద్ద లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్థి పనులను తర్వలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ చేపడతామని కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఈమేరకు అక్కడ రానున్న 10 రోజుల్లో భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు.