తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులను కలిసి పరిస్థితులను అడిగి తెలుసుకుంటామని తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయినట్లు సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
సీఎం కేసీఆర్ బదులుగా మంత్రుల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి, వ్యవసాయశాఖ ఫీల్డ్ అధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుంటారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వీరు వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు.
అందుకు సంబంధించిన నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందించనున్నారు. కాగా వడగళ్ల వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రూ.960 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలోని 18 మండలాల్లోని మిరప, మొక్కజొన్న, బొప్పాయి, కూరగాయలు, కంది పంటలకు 100 శాతం నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొంటున్నారు