దోస్త్ మేరా దోస్త్.. అంటూ కేసీఆర్ బీజేపీతో సంధి కోసం ప్రయత్నిస్తున్నారా..? ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక డిల్లీ ముఖం కూడా చూడని కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నారు…? ప్రధానిని కలవాలని కేసీఆర్ అనుకున్నా ముందు అమిత్ షాను కలిసి వచ్చాకే పీఎం మాట్లాడుతారని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించిందా..? ఇప్పుడిదే డిస్కషన్ రాజకీయవర్గాలలో జరుగుతోంది.
గురువారం కేసీఆర్ డిల్లీ వెళ్తారు. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. గోదావరి-కృష్ణా అనుసంధానం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాళేశ్వరానికి లేదా పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయహోదాపై మోదీతో చర్చిస్తారు అన్నది సీఎంవో వర్గాల అనధికార సమాచారం.
చెప్పినట్లే డిల్లీ వెళ్లారు కానీ… ప్రధానితో భేటీ సమయం వాయిదా పడింది. పైగా ప్రధానితో సమావేశానికి ముందు బీజేపి చీఫ్ అమిత్‌షాను కలిశారు కేసీఆర్. ఇందులో ఏదో మర్మం ఉందని… లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఇద్దరి మధ్యా పెరిగిన గ్యాప్‌ను ఫిల్ చేసుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రజాఫ్రంట్ పేరుతో కేసీఆర్ దేశంలో కూటమి కోసం ప్రయత్నించారని, కాంగ్రెస్‌తో జతకట్టిన కొన్ని దక్షిణాది పార్టీలకు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. దీనిపై బీజేపీ గుర్రుగా ఉందన్న ప్రచారం కూడా సాగింది. అప్పటి నుంచే బీజేపీ కేంద్ర నాయకత్వానికి, కేసీఆర్‌కు గ్యాప్ బాగా పెరిగింది. అందుకే రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ డిల్లీ పర్యటన చేయలేదు.
కానీ, బీజేపి కూడా టీఆర్ఎస్‌పై దూకుడు ప్రదర్శిస్తూనే చాకచక్యంగా వ్యవహరించింది. ఓవైపు రాష్ట్రంలో సై అంటే సై అంటూనే ఉన్నా… కేంద్రంలో ఆర్టికల్ 370రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లులు గట్టే వరకు వేచి చూసింది. అందుకే ఆ బిల్లులు పాసయిన వెంటనే… బీజేపి నేతలు మాటల దాడి పెంచేశారు. బీజేపి అధికార ప్రతినిధి రఘునందన్ రావ్ అయితే ఏకంగా బీహార్‌లో లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు పట్టబోతుంది అంటూ తొలివెలుగు ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌కు వేరే ఆప్షన్ లేదు. పైగా బీజేపీ తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తుంది. దాంతో కేసీఆర్ బీజేపీని మళ్లీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే మోడీతో భేటీ అవ్వాలని అనుకున్నా మోడీ మాత్రం అమిత్‌షాను కలిశాకే… తను కలిసేది అని ఉంటారని ఢిల్లీ వర్గాలంటున్నాయి. అందుకే సడన్‌గా మోడీతో భేటీ రీషెడ్యూల్ అయిందని, అమిత్‌షా తో భేటీ అయ్యాకే ప్రధాని మోడీ కలుస్తారని అన్నారు. అనుకున్నట్లుగానే కేసీఆర్ అమిత్ షాతో భేటీ కావటం చర్చనీయాంశం అవుతోంది.