ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్ ఖండ్ బోడ్ మైదాన్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
కేసీఆర్ నాందేడ్ చేరుకోగానే ఆయనకు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్ ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొని.. స్థానిక నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. సభా వేదికపై కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అమెరికా కంటే కూడా మన దేశం సంపద గల దేశమని అన్నారు. కానీ, దేశ సంపద మొత్తం కొంతమంది చేతుల్లోకే వెళ్తుందని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు, పార్టీలు వచ్చాయని.. ప్రజల జీవితాల్లో ఏ మార్పు రాలేదని చెప్పారు. దేశంలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, పేదరికం అలాగే ఉన్నాయని చెప్పిన కేసీఆర్… మహారాష్ట్రను చూస్తే బాధేస్తుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చాలామది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తుందని.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ తమ నినాదమని తెలిపారు. మతాలు, జెండాలు, కులాల పేరుతో దేశంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు కేసీఆర్. భారతదేశం బుద్ధిజీవుల దేశం.. బద్దూగాళ్ల దేశం కాదని స్పష్టం చేశారు.