కరెంట్ కోసం మరోసారి అన్నదాతలు రోడ్డెక్కారు. పగలంతా వ్యవసాయ పంటలకు కరెంట్ ఇవ్వాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. రెండు గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
అయితే వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు మండిపడ్డారు. ఇలాగైతే..పంటలు ఎలా పండించుకోవాలని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. పంటలు పండక,పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేదని అన్నదాతలు కన్నెర్ర చేశారు.
రైతులను అరిగోస పెడుతున్న సీఎం కేసీఆర్ కు వారి ఉసురు తప్పక తగులుతుందని రైతులు మండిపడ్డారు. బిల్లుల పేరుతో కరెంట్ తరుచూ నిలిపేయడంతో వేసిన వరి నాట్లు, నారుమడులు, మిర్చి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై రైతులు బైకులు అడ్డుగా పెట్టి.. కేసీఆర్ డౌన్ డౌన్ .. కరెంట్ ఆఫీసర్ల వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు పలు గ్రామాల రైతులు, కాంగ్రెస్ లీడర్లు మద్దతు తెలిపారు.
అన్నదాత నిరసనతో పరకాల,జమ్మికుంట,భూపాలపల్లి వైపు వెళ్లే దారుల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. చివరకు తహసీల్దార్, ఆర్ఐ వచ్చి రైతులకు కరెంట్ విషయంలో హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించుకున్నారు.