కేసీఆర్ ఇన్నాళ్లు బీజేపీకి వంత పాడి ఇప్పుడు విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిలా మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.
ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేసి తెలంగాణ సంపదను కళ్ల ముందే దోచుకున్నాడని ఆమె విమర్శించారు. ఇప్పుడేమో అదే బీజేపీని తిట్టినట్టు చేసి దేశాన్ని కూడా దోచుకుందామని కుట్ర చేస్తున్నాడని అన్నారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా విభజన హామీలపై కేసీఆర్ ఊసెత్తడం లేదని, నీటి వాటాపై మాట్లాడడం లేదన్నారు. నీళ్లు,నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అయినా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని ధ్వజమెత్తారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్తం చిందించి ప్రజలంతా పోరాడి స్వరాష్ట్రం సాధించుకుంటే రాష్ట్ర నీటి వాటాలపై కనీసం మాట్లాడడం లేదని ఆరోపించారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాబట్టే నోరు విప్పడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల పోరాటాన్ని ఆసరాగా చేసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రాష్ట్రాన్ని అడుగడుగునా కొల్లగొట్టడం, తెలంగాణ తల్లికి ద్రోహం చేయడమే కేసీఆర్ దొంగ దీక్ష లక్ష్యమా అని ఆమె ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డ ఆమె బీజేపీ,ముక్త్ భారత్, బీఆర్ఎస్ ముక్త్ భారత్ కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మోసం చేయడం మానేయాలని.. లేకపోతే.. తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని..ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె మండిపడ్డారు. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు.