ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు ఛరిష్మాను వాడుకుని లబ్ది పొందిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎన్నికలయ్యాక ఆయన్ను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. స్వర్గీయ పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ ను సందర్శించారు బండి. ఈ సందర్భంగా పీవీకి ఘన నివాళి అర్పించారు. పీవీ బహుభాషా కోవిదుడు, మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు పాలించిన రాజనీతిజ్ఝుడు అని కొనియాడారు.
ఈ సందర్భంగా పీవీ జయంతి ఉత్సవాలకు సీఎం గైర్హాజరుపై విరుచుకుపడ్డారు. మాజీ ప్రధాని జయంతికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. పీవీ జన్మస్తలం వంగరను అభివ్రుద్ది చేస్తా.. స్మారక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం కేసీఆర్ వెన్నతో పెట్టిన విద్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తి తెలంగాణలో జన్మించడం.. అందులోనూ తమ కరీంనగర్ జిల్లాకు చెందిన బిడ్డ కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధానిగా ఉన్నత పదవుల్లో కొనసాగి ఎన్నో సేవలందించిన మహనీయుడు పీవీ అని గుర్తు చేశారు.
సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి అని తెలియజేశారు. పేదల గురించి నిత్యం ఆలోచించిన వ్యక్తి అని పీవీ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు స్పూర్తి దాయకంగా తీసుకోవాలని పేర్కొన్నారు బండి సంజయ్.