సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనలు, బహిరంగ సభలు మొదలు పెట్టారు. ఈక్రమంలో రేపు పాలమూరులో ఆయన పర్యటించనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
తరువాత ఆయన ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు జిల్లా వేరు… ఇప్పుడున్న పాలమూరు జిల్లా వేరు.. అన్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు పూర్తిగా అభివృద్ది చెందిందన్నారు. గతంలో వలసల జిల్లాగా పేరున్న పాలమూరు నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్నారు.
బహుశా..14 లక్షల మంది వలస వెళ్లిన జిల్లాగా ప్రపంచంలో పాలమూరు ఒక్కటేనని అన్న ఆయన.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే బతకడం కోసం పాలమూరుకు వలస వస్తున్నారన్నారు. ఆంధ్రా, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి పాలమూరుకు జనాలు బతకడానికి వస్తున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకొని మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేగంగా అభివృద్థి చెందిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ ను మరింత వేగంగా అభివృద్ధి చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.