ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ స్వాగతం పలకాలి. కానీ.. మంత్రి తలసాని శ్రీనివాస్.. సీఎం స్థానంలో వెల్ కమ్ చెబుతారని సీఎంవో వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అనేక రకాల వార్తలు తెరపైకొస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ పై అసహనం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ మూడు రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి బీజేపీ నేతలు తమదైన స్టయిల్ లో ఎదురుదాడి కూడా చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం వెళ్తారా లేదా? అనే చర్చ జోరుగా జరిగింది. అయితే.. మంత్రి తలసాని పీఎంకు వెల్ కమ్ చెబుతారని ప్రకటన విడుదలైంది.
నిజానికి ఆరోజు ప్రెస్ మీట్ లోనే ప్రధాని పర్యటనలో పాల్గొంటానని.. అన్ని విషయాలు నేరుగా మాట్లాడతానని అన్నారు కేసీఆర్. ప్రోటో కాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం చెబుతారని.. కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అధికారిక కార్యక్రమాలకు రాజకీయానికి సంబంధం లేదని టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతూ వచ్చాయి. దాన్నిబట్టి ప్రధాని టూర్ లో కేసీఆర్ పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ.. సడెన్ గా తలసాని పేరు తెరపైకి వచ్చింది.
కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసి మళ్లీ మోడీకి స్వాగతం చెప్పి ఆయనతో సాధారణంగా వ్యవహరిస్తే కేసీఆర్ పోరాటం అంతా బూటకమేనని విపక్షాలు ప్రచారం చేస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. అసలు సంగతి వేరే ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏ మొహం పెట్టుకుని స్వాగతం చెబుతారని ఢిల్లీ నుంచి కచ్చితమైన ఆదేశాలు వచ్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.