– నీ బిడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలా?
– సారా స్కాంలో అరెస్ట్ చేస్తే..
– తెలంగాణ అంతా ఎందుకు ధర్నా చేయాలి?
– నమ్మి అధికారమిస్తే ప్రజలకు చిప్పచేతికిస్తావా?
– నిజాయితీగా పనిచేసే వారిపై దాడులు జరగవు
– దందాలతో రాష్ట్రాన్ని దోచుకుంనే వారిపైనే జరుగుతాయి
– కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్
ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్ చేరింది. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ‘‘కేసీఆర్.. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఝాన్సీ లక్ష్మీబాయినా? ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల సారా(లిక్కర్) దందా చేసింది. అట్లాంటామెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలి?’’ అని ప్రశ్నించారు.
నిర్మల్ జిల్లా మంత్రి అవినీతి వేలాది ఎకరాలను కబ్జా చేసి వేల కోట్లు దోచుకున్న తిమింగలంలా మారిందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 40 శాతం ఒక వర్గానికే కేటాయిస్తే 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోనని, హిందువులను మోసం చేసి దాడులు చేస్తే.. నిర్మల్ కు వచ్చి ఒక్కొక్కరిని బట్టలూడదీసి తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.
అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతోపాటు అవినీతి తిమింగలం అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిర్మల్ లో ప్రభుత్వ భూములనే సాకుతో శాంతి నగర్ లో పేదల ఇండ్లను కూల్చేసిన అధికారులు.. అవే ప్రభుత్వ భూముల్లో బడా బాబుల విల్లాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్ కు బుల్డోజర్లను పంపి బడాబాబుల ఇండ్లను కూల్చివేయిస్తామని స్పష్టం చేశారు.
లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే వారి బట్టలూడదీయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో హిందూ అమ్మాయి శ్రద్దా వాకర్ ను 36 ముక్కలు చేయడంతోపాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఆ అప్తాబ్ విషయంలో లౌకిక శక్తుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని నిలదీశారు బండి సంజయ్.