ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించనుంది. ఈ రోజు ఆమె ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల తర్వాత
తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆమె ఈ నెల 8న ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న బీఆర్ఎస్ విస్తృత సమావేశం ముగిసన తర్వాత ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఇది ఇలా వుంటే ఎమ్మెల్సీ కవితకు తాను బినామీ నంటూ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఇచ్చారంటూ ఈడీ రిపోర్టులో పేర్కొంది. కానీ ఇంతలోనే తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆ కొద్ది సేపటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం రిమాండ్ రిపోర్టులోనూ కవిత విషయంలో ఈడీ కీలక అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలను ఈడీ రెడీ చేసుకుంది. విచారణ సమయంలో ఆమెపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనున్నట్టు తెలుస్తోంది.