– లిక్కర్ స్కాం కేసు.. కవితకు బిగుస్తున్న ఉచ్చు!
– అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేరు
– 100 కోట్లు సమకూర్చినట్లు ఈడీ వెల్లడి
– రేపే మాపో అరెస్ట్ అంటూ వార్తలు
– సీబీఐ కేసు కంటే ఈడీ కేసే పవర్ ఫుల్
– అన్ని ఆధారాలతోనే వెల్లడించిన ఈడీ!
– క్రిమినల్ కేసులు కాదు.. ఆర్థిక లావాదేవీలే ముఖ్యం
– వారం లోపే కీలక స్టెప్ తీసుకునే ఛాన్స్
క్రైంబ్యూరో, తొలివెలుగు:సీబీఐ చార్జ్ షీట్ లో పేర్లు లేవని క్లీన్ చిట్ ఇచ్చుకున్న నేతలకు ఈడీ ఉచ్చు బిగించినట్లు కనిపిస్తోంది. సీబీఐ కేసులో నిందితులకు ఎవరెవరు ఆర్థిక సహాయం చేశారో.. పూర్తి అధారాలు సేకరించినట్లు సమాచారం. ఈక్రమంలోనే బుధవారం అరెస్ట్ చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు ఈడీ అధికారులు. గతంలో సీబీఐ కేసుల్లో చార్జ్ షీట్ ని తీసుకుని విచారించే ఈడీ అధికారులు.. ఈసారి ఓ అడుగు ముందుకేసి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ దశలోనే దర్యాప్తు మొదలు పెట్టారు.
సీబీఐ కేవలం నేరం చేసిన వారిపై అభియోగాలు మోపింది. ఈడీ మాత్రం నేరస్థులకు సహాయం చేసిన వారి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. దీంతో సిసోడియా అనుచరుడు అమిత్ ఆరోరా అరెస్ట్ తో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కవిత 100 కోట్లు సహాయం చేసినట్లు తెలిపింది ఈడీ. దీంతో ఆమెతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం ఈడీ నుంచి తప్పించుకోవడం కష్టమంటున్నారు.
సీబీఐ అయితే చార్జ్ షీట్ వేశాక.. నిందితులకు బెయిల్ దొరకవచ్చు. అదే ఈడీ కేసు అయితే.. గతంలో స్టాలిన్ చెల్లెలు కనిమొళికి ఏడాది తరువాత బెయిల్ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సాక్ష్యాధారాలు సంపాదించాకనే.. ముఖ్యమైన నేతలపై గురి పెట్టారని అంటున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే.. ఏడాది వరకు బెయిల్ రాకుండా చేసేలా ఈడీ కేసును తయారు చేసిందని ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న 36 మంది 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని.. వాటి విలువ రూ.1.38 కోట్లుగా చెబుతున్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ 26వ పేజీలో 32వ నెంబర్ లో కవిత కల్వకుంట్ల పేరు ఆమె వాడిన మొబైల్ వివరాలు ఉంచారు. ఆమె 2 నెంబర్లతో 10 ఫోన్లు వాడినట్లు ఆ ఫోన్ నెంబర్ల ఐఎంఈఐ వివరాలతో సహా పేర్కొన్నారు అధికారులు. ఒక నెంబర్ తో 6 ఫోన్లు వాడారని.. వాటిని ధ్వంసం చేశారని అంటున్నారు. మరో నెంబర్ తో నాలుగు ఫోన్లు వాడారని వాటిని కూడా నాశనం చేశారని చెబుతున్నారు. ఈ మొత్తం లిక్కర్ స్కాంలో 36 మంది 170 ఐఫోన్లు వాడాట. కవిత అనుచరుడు అభిషేక్ బోయినపల్లి 5, ఆడిటర్ బుచ్చిబాబు 6, శరత్ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చారని.. వాటన్నింటినీ ధ్వంసం చేశారని చెబుతున్నారు అధికారులు.