- భక్త కేసీఆర్ ఎజెండా ఏమిటి..?
- హర్ ఘర్ తిరంగాలో సారు పాల్గొంటారా?
- గొప్ప హిందువు అనే వ్యాఖ్యలు బీరాలేనా..?
- బీజేపీని దెబ్బకొట్టేలా కేసీఆర్ దేశభక్తి..!
దేవుడి పై భక్తి మాటల్లో చెప్పేది కాదు. పాటల్లో పాడేది కాదు. భక్తి అని చెప్పుకుంటూ మడి కట్టుకొని పూజలు చేయడం వేరు. మనుసులో దేవుడిని మనస్ఫూర్తిగా తలచడం వేరు. భక్తిభావన లేకుండా దైవ భక్తున్ని అని చెప్పుకునే కొంతమందిలో రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో సీఎం కేసీఆర్ ఏ కోవకు చెందుతారో మీరే ఆలోచించాలి…
అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీరు ‘జై శ్రీరామ్’ అంటే మేము ‘జై హనుమాన్’ అంటాం అంటూ బీజేపీతో భక్తి పోటీకి దిగారు. కొంతకాలం మాట ప్రకారం తగ్గకుండా.. అక్కడక్కడ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకో.. సైలెంటై పోయారు. భక్తి పోటీ ఆపేశారు.
అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు..నేను చేసిన పూజలు, పునస్కారాలు, యాగాలు ఎవరైనా చేశారా అంటూ బీరాలు పలికారు. ఇలాంటి మాటలతో నేను హిందువునే అనే మాట గుర్తు చేస్తూ ఉండేవారు ముఖ్యమంత్రి. అయితే ఆయన కడుపులోంచి వచ్చిన హిందుగాడు బొందుగాడు వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో,.. ఆయన చెప్పిన నేనూ హిందువునే …డైలాగు అదే లెవల్ లో పాపులర్ అయింది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీతో దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి.. అంటే ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటిపైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా పేరిట దేశ వ్యాప్తంగా జెండా పండగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఎనిమిదేళ్ళ పాలనలో సీఎం కేసీఆర్ ఏనాడూ జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొనలేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు. ఈ సంవత్సరం రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొనలేదు, మీ జెండా మీది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో కానీ,..ముఖ్యమంత్రి కేసీఆర్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో మరిచి పోయారు.
అయితే, దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని, ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి… అధికారులను ఆదేశించారు. అలాగే, మేమూ హిందువులమే.. అన్నట్లుగా, మాకూ దేశభక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతృత్వంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వ్యూహరచన చేశారని అంటున్నారు.