బీఆర్ఎస్ ప్రభుత్వం పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. షామీర్ పేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు జనవరి 26 అని అన్నారు. అలాంటిది కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించలేకపోతున్నామని.. మీ రాజ్ భవన్ లోనే నిర్వహించుకోండి అని కేసీఆర్ లేఖ రాయడం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కూడా పద్ధతి కాదన్నారు.
ఇలా చేయడం కూడా రాజ్యాంగాన్ని, ప్రజలను అవమానించడమే అని అన్నారు. మా హక్కులను కాలరాస్తూ..మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటికి గెంటివేస్తున్నారని మండి పడ్డారు. ఫిబ్రవరి 3 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ఈటల. రాచరికపు పోకడలకు ఇది పరాకాష్ట అని అన్నారు. ఒక్క నాడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీని కూడా ఐదుగురు సభ్యులు లేరని, ముగ్గురు సభ్యులే ఉన్నారని బీఏసీ సమావేశానికి కూడా పిలవడం లేదన్నారు.
గత ప్రభుత్వాలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా..బీఏసీ సమావేశానికి పిలిచేవారన్నారు. ఎమ్మెల్యేలు కనీసం సీఎంను కలిసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. పార్టీల మధ్య ఇనుప గోడలు పెట్టి, రాచరికపు పోకడలను అణువణువునా అమలు చేస్తున్న నీచమైన కేసీఆర్ అంటూ ఈటల మండిపడ్డారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి కొనేస్తున్నారని.. కేసీఆర్ అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుంటూ.. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే 600 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. మునుగోడులో 100 కోట్లు ఖర్చు చేశారన్నారు.
వ్యవసాయానికి ఎక్కడా కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఏసీడీ పేరుతో విద్యుత్ బిల్లుల్లో కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని మండి పడ్డారు. దళిత కాలనీల్లో ఫ్యూజ్ లు పీకేసీ కరెంట్ కట్ చేస్తున్నారని అన్నారు. దళితబంధు, దళితులకు 3 ఎకరాల భూమి లేదన్నారు. 60 వేల కోట్ల అప్పుల్లో డిస్కమ్ లున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట దగ్గర నిష్ణాతులైన ఇంజినీర్లు అడుగుపెట్టే పరిస్థిత లేదన్నారు ఈటల. తాను హుజురాబాద్ నుంచి గెలిచి 13 నెలలవుతున్నా.. ఒక్క అధికార కార్యక్రమానికి ఆహ్వానం లేదని.. ఈ ఎకిలి,మకిలి చేష్టలు ఎన్ని రోజులుండవని ఈటల వార్నింగ్ ఇచ్చారు.