ఓవైపు ఈడీ విచారణకు సంబంధించి చర్చించేందుకు కేసీఆర్, కవిత.. ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరి చర్చలు సాగాయి. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి భార్య శోభ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
భార్య వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇటు తన తల్లిని చూడటానికి ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్యంపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి బయటకొచ్చారు కవిత.
అయితే.. కవిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నేరుగా బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 16న మరోసారి లిక్కర్ స్కాం కు సంబంధించి కవితను విచారణకు పిలిచింది ఈడీ. దీనిపై చర్చించేందుకు మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వెళ్లారు కవిత. న్యాయనిపుణులతో కూడా ఆమె చర్చలు జరిపారు.