అర్హత లేని కంపెనీకి పోలవరం ప్రాజెక్టుని అప్పగించి రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు మోపడానికి రూ.500 కోట్లు మిగిల్చినట్లు నాటకమాడుతున్నారని, నిజానికి రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రానికి 5వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని టీడీపీ లెక్కలతో సహా వివరించింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు మెగా క్రిష్ణారెడ్డికి రూ.2 వేల కోట్ల విలువ చేసే ఎలక్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్దమైందని, అలాగే 30 వేల కోట్ల విలువ చేసే వాటర్ గ్రిడ్ పనులు మెగా క్రిష్ణారెడ్డికి అప్పగించేందుకు పథక రచన చేశారని తెలుగుదేశం పార్టీ కొత్త కోణాన్ని బయటపెట్దింది.
గుంటూరు: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు భద్రతకే పెను ముప్పు వాటిల్లబోతోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వహణను అనుభవం లేని సంస్థలకు అప్పగించడానికి నిబంధనలు తుంగలో తొక్కారని కేఈ దుయ్యబట్టారు. డ్యామ్ పనులు మరియు పవర్ ప్రాజెక్టు పనులు వేర్వేరుగా టెండర్లు పిలకవకుండా ఒకే టెండర్‌లో పిలవడంలో మీ ఉద్దేశం ఏమిటని జగన్ సర్కారును నిలదీశారు. రోడ్లు వేసే ఇంజనీర్లకు డ్యామ్‌ల నిర్మాణం గురించి తెలిసే అవకాశం ఉంటుందా అని ఎద్దేవాచేశారు.
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టుగా అసమర్ధ కంపెనీకి పోలవరం పనులు అప్పగించారని గతంలో సాక్షి పత్రికలో కథనాలు రాసి, ఇదే కంపెనీపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అదే కంపెనీకి ప్రాజెక్టు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని కేఈ డిమాండ్ చేశారు. ఐదేళ్లలో 63 శాతం పనులు పూర్తి చేసిన కంపెనీని పక్కన పెట్టి 10 ఏళ్లలో 7 శాతం పనులు పూర్తి చేసిన కంపెనీకి కొత్తగా పనులు అప్పగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును మరో ధన యజ్ణం చేయదలిచారా? అని ప్రశ్నించారు.
‘మేము రాష్ట్ర భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నిర్వహణ చేపడితే వంకలు పెట్టారు. అర్ధం, పర్ధం లేని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసకర చర్యల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును కూడా నిలిపివేశారు. ఏ రకమైన ఆరోపణలు లేకుండానే పాత కాంట్రాక్ట్ సంస్ధలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు తన వర్గానికి చెందిన మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి భారీ ప్రాజెక్టులు నిర్మించే అర్హత లేకపోయినా ఈ ప్రాజెక్టును అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి నిబంధనలు సడలించారు…’ అని కేఈ వివరించారు.
‘గతంలో ఒక్క శాతం పనులు పూర్తి చేయలేక చేతులెత్తేసిన మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థకు పనులు అప్పగించడం, వైసీపీ నాయకులు దానికి ఆహా… ఓహో అంటూ భజన చేయడం జగన్నాటకంలో మొదటి అంకం మాత్రమేనని అన్నారు. రివర్స్ టెండరింగ్ చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ భద్రతకు పాత కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారా? లేక కొత్త కాంట్రాక్టర్ వహిస్తారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. నాసిరకంగా పనులు చేస్తే ప్రాజెక్టుకు పెనుప్రమాదం. ఏదైనా జరగరానిది జరిగితే ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి.
*రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు ఆలస్యమౌతుంది. పాత కాంట్రాక్టర్‌ను కొనసాగించి వుంటే 2020 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించే వెసులుబాటు వుండేది. నవయుగను తొలగించి మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి కట్టబెట్టడం వల్ల కనీసం మూడేళ్లు ఆలస్యమౌతుంది. ఒక్క ఏడాది ఆలస్యమైతే విద్యుత్ బిల్లు రూ.300 కోట్లు అదనపు భారం పడుతుందని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది.
దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా 900 కోట్ల భారం పడుతుంది. అలాగే వేల కోట్ల రూపాయల పంట నష్టం జరుగుతుంది..’ అని కేఈ కృష్ణమూర్తి ఒక ప్రకటన చేశారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కేఈ కోరారు. శిలాఫలకాలు పగలకొట్టడం ద్వారా, మేము కట్టిన బిల్డింగ్గులకు రంగులు మార్చడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వున్న గుర్తింపును తొలగించలేరని అన్నారు.