దక్షిణాది మహానటి అందాల సావిత్రిగా టైటిల్ పాత్ర పోషించి, అందరి మన్ననలు అందుకోవడమే కాకుండా, ఆ సినిమాలో తన నటనకు ఏకంగా జాతీయస్థాయిలో ఉత్తమనటిగా పురస్కారం అందుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటి ఘనవిజయం సాధించినా తర్వాత తెలుగు సినిమాలపై పెద్దగా కాన్సన్‌ట్రేట్ చేయలేదు కీర్తి. అయితే రీసెంట్‌గా వచ్చిన, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన “మన్మథుడు-2” సినిమాలో ఒక చిన్న కేమియో రోల్‌లో చటుక్కున మెరిసింది కీర్తి సురేశ్. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పెద్దగా చేస్తున్నట్టు లేదు. తను కథానాయకిగా నటిస్తున్న తన తదుపరి తెలుగు చిత్రం టైటిల్ రివీలింగ్ వీడియోను కీర్తి విడుదల చేశారు. “మిస్ ఇండియా” అనే గమ్మత్తైన టైటిల్ ఉన్న ఈ సినిమాలో తన లుక్కు కుర్రకారుకు గిలిగింతలు పెట్టేలా ఉంది. ఇంతకు ముందు అందరికీ గుర్తున్న బొద్దుగా కనిపించిన కీర్తి సురేశ్ స్థానంలో కంప్లీట్ స్లిం లుక్కులో, చాలా స్టయిలిష్ గాళ్‌గా కనిపిస్తోంది కీర్తి. అలాగే అందులోని విజువల్స్ కూడా సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించినట్టు అనిపిస్తోంది.
కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, భానుశ్రీ మెహ్రా, నదియా అండ్ సుమంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ఈ మిస్ ఇండియా సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమాను, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాత మహేశ్ కోనేరు తెలియచేశారు.