ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎల్జీ రాజకీయాలను పక్కన పెట్టి ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.
స్వాతి మాలీవాల్‌ను ఆ వ్యక్తి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ నేపధ్యంలో ఎల్జీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్ధితి ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. గూండాల నైతిక స్థైర్యం పెరిగిందన్నారు.
చివరికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే భద్రత లేని పరిస్ధితి దాపురించిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ సాబ్ కొద్దిరోజులు రాజకీయాలను పక్కనపెట్టి నగరంలో శాంతి భద్రతలపై దృష్టిసారించాలని ఆయన ట్వీట్ చేశారు. నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో ఎల్జీకి తాము పూర్తిగా సహకరిస్తామన్నారు.
డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్‌ను గురువారం ఉదయం తప్పతాగిన కారు డ్రైవర్ వేధించాడు. ఆమె చేయి కారు విండోలో చిక్కుకుపోవడంతో ఆమెను 15 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.