ఢిల్లీ లిక్కర్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా 17 మంది పేర్లను ప్రస్తావించింది ఈడీ. అయితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడంతో ఈ కేసులో ఒక్కసారిగా హీట్ పెరిగింది.
428 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ లో కీలక విషయాలను వివరించింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్ తో మాట్లాడినట్లు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంను మొత్తం నడిపించింది విజయ్ నాయర్ అని చెబుతూ.. అతను.. కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్ లోనే ఈ కుంభకోణానికి సంబంధించిన తతంగం అంతా నడిపించినట్లు తెలిపింది. సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ పేరు వెల్లడైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. ఇప్పటికే విచారించిన వారిలో ఆమె పేరును పేర్కొంది. అలాగే, ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించింది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నట్లుగా ఛార్జ్ షీట్ లో అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ లో పేర్కొన్న నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై గురువారం విచారించింది న్యాయస్థానం. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెబుతూ.. అందులో పేర్కొన్న నిందితులకు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఈడీ. ఇందులో కొందరి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని నిందితులుగా పేర్కొంది. వారితోపాటు శరత్ చంద్రారెడ్డి, బినోయ్, అమిత్ అరోరాలను కూడా నిందితులుగా చేర్చింది. మొత్తం ఛార్జ్ షీట్ పై 428 పేజీలతో ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది ఈడీ.