ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.
ఢిల్లీ ప్రజలంటే మీకు ఎందుకంత కోపం అంటూ ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ ఆమోదించాలని ఢిల్లీ ప్రజలు చేతులు జోడించి వేడుకుంటున్నారంటూ తెలిపారు. ఇప్పటికైనా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన లేఖలో కోరారు.
షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ మౌలిక సదుపాయాల కంటే ఎక్కువగా ప్రకటనల కోసం ఎందుకు ఖర్చవుతుందో తెలపాలని బడ్జెట్ ప్రజెంటేషన్‌ను క్లియర్ చేయడానికి ముందు కేంద్రం ఆప్ సర్కార్ నుంచి వివరణ కోరింది.
ఈ క్రమంలో ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న వీడియోను ఆప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రోజు ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని వీడియోలో కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర సర్కార్ గూండాగిరి చేస్తోందని ఆయన మండిపడ్డారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్రం నిలిపివేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఢిల్లీ సర్కార్ బడ్జెట్ పై స్పష్టతను ఇవ్వనంత వరకు, బడ్జెట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పెండింగ్‌లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.