దేశంలోనే సొంత ఇంటర్నెట్ సర్వీసు కలిగిన తొలి, ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయిన్ విజయన్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఐటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కేరళ ఐటీ ఫైబర్ నెట్ వర్క్ లిమిటెడ్ ను ఇటీవల ప్రారంభించారు.
తాజాగా ఈ ప్రాజెక్టుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్ఎపీ) లైసెన్స్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం విజయన్ ట్వీట్ చేశారు. ప్రాజెక్టుకు ఐఎస్ఎపీ లైసెన్స్ రావడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
సమాజంలో డిజిటల్ విభజనను రూపుమాపేందుకు ఈ ప్రాజెక్టును తీసుకు వస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఐఎస్ఫీ లైసెన్సు కూడా రావడంతో ఇక ఈ ప్రాజెక్టు కార్యకలాపాలను ప్రారంభించ వచ్చని ఆయన పేర్కొన్నారు.
పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, రాష్ట్రంలోని 30000 ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత ఇంటర్నెట్ కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. 2019లో అప్పటి ప్రభుత్వం ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పౌరుల ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ఈ మేరకు రూ. 1,548 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.