ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేరళ సీఎం పినరయి విజయన్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేస్తూ.. పీఎంఓ ట్వీట్ చేసింది. సిల్వర్ లైన్ సహా.. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కల్పించాలని విజయన్ కోరినట్టు సమాచారం.
కొచి-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం భూసేకరణ వేగవంతంగా సాగుతున్నట్లు కేరళ సీఎం ప్రకటించిన మరుసటి రోజునే ఈ భేటీ జరగటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే.. సిల్వర్‌లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలువురు ఆందోళన చేస్తున్న క్రమంలో భేటీ కీలకంగా మారింది.
మరోవైపు కే-సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు యూడీఎఫ్ ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు తమను అడ్డుకోవటమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఓ కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.
దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. అక్కడ ఎవరిపైనా చేయి చేసుకోలేదని.. వారి గురించి ఏమీ చెప్పకుండా నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు దూసుకెళ్తుండగా బారికేడ్ల వద్దే ఉండి సిబ్బంది అడ్డుకున్నారని ఓ పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. వారు ఎంపీలని తెలిసిన తర్వాత వారికి నిరసన తెలిపేందుకు అనుమతించామని పేర్కొన్నారు.